తిరుపతి క్రైం : సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు విషవాయువులు పీల్చి మృతి చెందిన ఘటన తిరుపతిలో శుక్రవారం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్‌రాజ్ (36), నరేష్ (21)గా గుర్తించారు. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసేందుకు భీమ్‌రాజ్ దుప్పట్లను తాడులా కట్టి బావిలోకి దిగాడు. అయితే ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో నరేష్ కూడా అతడిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో విషవాయువులు పీల్చడంతో ఇద్దరూ బావిలోనే మృతి చెందినట్లు సమాచారం. అలిపిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో విషవాయువులు ఉన్నట్లు గుర్తించడంతో ఫైర్ సిబ్బంది లోపలికి దిగేందుకు సాహసించ లేదు. అనంతరం పాతాళభేరి సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు.
మృతి చెందిన యువకులు


