బాబు పాలనలో కరువు విలయతాండవం | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో కరువు విలయతాండవం

Sep 12 2026 12:30 AM | Updated on Sep 12 2026 12:30 AM

● ఆయన అధికారంలో ఉంటే అతివృష్టి..అనావృష్టే ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే ఇక పంటల పరిస్థితి ఏమిటి దేవుడా అంటూ రైతుల గుండెల్లో దడ పుడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి, అనావృష్టే తప్ప సమృద్ధిగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదన్నారు. ఎకనామిక్స్‌ టైమ్స్‌ పత్రిక వారు చంద్రబాబుకు వాటర్‌మెన్‌ బిరుదును ఎగతాళితో ఇచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. సకాలంలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోందన్నారు. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి సాగు, తాగునీరు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. 1995– 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు 1,400 మండలాలకు గాను 1200 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారని గుర్తుచేశారు. 2014–19వరకు కరువు, అతివృష్టి వచ్చిందన్నారు. చంద్రబాబు, కరువు ఒకే కడుపున పుట్టిన కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు.

స్వామి భక్తి కన్నా

చంద్రబాబు భక్తే ఎక్కువా?

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌కు స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపైన ఎంత అపారమైన భక్తి ఉన్నా దానిని మనసులో దాచుకోవాలే తప్ప మీ ఫోన్‌ వాట్సాప్‌ డీపీలో చంద్రబాబుతో కలిసి ఉన్న ఫొటోను పెట్టుకోవడం స్వామి సేవకుడిగా, టీటీడీ ఉద్యోగిగా సరికాదన్నారు. ఇప్పటికే పూర్వ డిప్యూటీవో లోకనాథన్‌యాదవ్‌ మీద దాడి చేయడం వెనుక చాలా పేర్లు బయటికి వస్తున్నాయని, వీళ్లందరూ ఆ ఉద్యోగం కావాలనుకున్నవారేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement