రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం, అనుపల్లి రెవెన్యూ పరిధి, ఉప్పులవంక గ్రామంలో ఇటీవల జరిగిన భూ వివాదంలో ఏకంగా 20 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితుల కథనం.. ఉప్పులవంక గ్రామంలోని సర్వే నం.318కి సంబంధించి నెలకొన్న వివాదంపై రైతులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ మధుసూదనరావు ఈనెల 1న గ్రామ సర్వేయర్‌తో కలిసి క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లారు. ఆపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి సమస్యను పరిష్కరించకుండానే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత రైతులు తహసీల్దార్ కారు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు ఏకంగా 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో నలుగురు మహిళలు, ఓ చంటిబిడ్డ తల్లి ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి భార్య ఒత్తిడితోనే కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఓ పత్రిక విలేకరి (సాక్షి కాదు)పై కూడా కేసు నమోదు చేశారు.


