తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే తమ లక్ష్యమని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతిలోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం సాధించడంతో పాటు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతయ్యేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పదో తరగతి బోధించే సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఒక్కరోజు ప్రత్యేక శిక్షణ తరగతులను ఆయా సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8న తెలుగు, గణితం, 9న హిందీ, బయాలజికల్ సైన్స్, 10న ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, 11న సోషియల్ సబ్జెక్టుల్లో తరగతులు ఉంటాయన్నారు. 2026–27విద్యా సంవత్సరంలో పదో తరగతి సిలబస్, పరీక్షా విధానం, ఎస్‌ఎస్‌సీ మార్చి, 2007 బ్లూప్రింట్, మోడల్ పేపర్లను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకే ఈ శిక్షణ తరగతులను ఉపాధ్యాయులకు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారి స్థాయికి అనుగుణంగా బోధించడం, వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయుల ద్వారా దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఈ శిక్షణలో ప్రధానాంశాలుగా ఉంటాయన్నారు. జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) ద్వారా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య హైస్కూళ్లల్లో పదో తరగతి బోధిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ కోరారు.


