నాయుడుపేట టౌన్ : మండల పరిధిలోని విన్నమాల గ్రామంలో 2021లో హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.25 వేలు జరిమానా విధిస్తూ న్యాయ స్థానం తీర్పు చెప్పినట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2021 నవంబర్ 17వ తేదీ విన్నమాల గ్రామానికి చెందిన అరవ శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన పేర్నాటి సాగర్, పేర్నాటి బెన్‌హర్, పేర్నాటి అనీల్ అనే అన్నదమ్ములు దాడిచేయడంతో అప్పట్లో ఎస్‌ఐగా ఉన్న చింతం కృష్ణరెడ్డి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడు చికిత్సలు పొందుతూ మృతి చెందడంతో హత్య కేసుగా నమోదు చేసి అప్పటి సీఐగా పనిచేసిన వైవీ సోమయ్య దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సోమవారం హత్య కేసుపై విచారణ జరిపి నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు న్యాయాధికారి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లుగా డీఎస్పీ వివరించారు.


