ట్రాక్టర్లు వేరు.. ట్రక్కులు మాత్రం ఒక్కటే
శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకుల అరాచకాలు
పోలీసుల అనుమతులపై పలు సందేహాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: మైనింగ్ ట్రాక్టర్లు సామాన్యుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల అతి వేగానికి వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. సామాన్యులు ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలోనే మైనింగ్ ట్రాక్టర్లు ఢీకొని ఆరుగురు మృతి చెందారంటే మాఫియా ఏ స్థాయిలో అధికారులను మేనేజ్ చేస్తుందో అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా వేళ్లూనుకుంది. పచ్చనేతల ధనదాహం ముందు సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.
శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఆదివారం మట్టి ట్రాక్టర్ ఢీకొట్టి తొట్టెంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. అంతకు ముందు శ్రీ కాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తుండగా, బైపాస్‌రోడ్డులోని అండర్ పాస్ వంతెన వద్ద మట్టిలోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్కు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనాస్థలికి కొద్దిదూరంలోనే అతి వేగంగా వస్తున్న మట్టి ట్రాక్టర్ చంద్రశేఖర్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలలో ట్రాక్టర్ ఇంజన్లు వేరైనా ట్రక్కు మాత్రం ఒక్కటేనని తేలింది. ట్రక్కులకు నంబరు ప్లేట్లు కూడా ఉండవు. తొలి ఘటనలో ట్రాక్టర్ యజమానిపై పోలీసులు చర్యలు తీసుకున్నారా, తీసుకుని ఉంటే మళ్లీ అదే ట్రక్కును వేరే ట్రాక్టర్‌కు అమర్చి మట్టి తోలడానికి ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్న..ఈ ఉదంతాన్ని ఆసాంతం పరిశీలిస్తే అక్రమ మైనింగ్ మాఫియా అరాచకం ఇట్టే అర్థమవుతోంది.
రెండు నెలల్లో మట్టి ట్రాక్టర్లు ఢీకొని ఇద్దరు మృతి
డ్రైవర్ ఎక్కడ?
యువకుడు చంద్రశేఖర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్‌ను అక్కడే వదిలి పరారైన డ్రైవర్‌ను శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికార ఒత్తిళ్లతోనే కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్త్న్నుట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు ఇసుక, మట్టి స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా, రికార్డులు సక్రమంగా లేని ఐదు ఇసుక, మట్టి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.


