ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న అన్ని జూనియర్‌ కళాశాలల్లో, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్ల గడువును బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ మరో మారు పొడిగించింది. ఈ నెల 15వ తేదీలోపు అడ్మిషన్లకు అవకాశమిస్తూ అన్ని కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించింది. దీంతో ఇప్పటి వరకు అడ్మిషన్లు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఐఓ గోపాల్‌రెడ్డి సూచించారు.

డయల్‌ యువర్‌ సీఎండీకి 71 వినతులు

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సిఎండి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 71 మంది వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీకి విన్నవించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గులు, గృహాలపై నుంచి వెళ్లే విద్యుత్తు లైన్ల మార్పు తదితర సమస్యలను వినియోగదారులు సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

భానుడి భగభగలు

తిరుపతి తుడా: భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సెప్టెంబర్‌లోనూ ఊహించని ఎండలు జనానికి షాక్‌ ఇస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఎనిమి ది గంటల నుంచే భగభగమంటూ నిప్పులు కక్కుతున్నాడు. అదే స్థాయిలో ఉక్కపోత సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఎండ ప్రభావం కనిపించింది.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,115 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,053 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

ప్రతి రోగి దైవంతో సమానం

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి దైవంతో సమానంగా భావించి, వారికి మెరుగైన సేవలందించాలని స్విమ్స్‌ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్‌ గుడారు జగదీష్‌ సూచించారు. స్విమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సమస్యలతో వస్తుంటారని, అలాంటి సమయంలో సెక్యూరిటీ సిబ్బంది సహనంతో, మర్యాదగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు విద్యా సంస్థలల్లో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్‌లో యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులకు సోమవారం తొలి విడత ప్రవేశాల మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2026–27 విద్య సంవత్సరానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో తొలి అడ్మిషన్‌గా విద్యార్థి బి రామశేష సాయి శివారెడ్డికి బీఎస్సీ హానర్స్‌ జువాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కిషన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.మల్లికార్జున, అధికారులు విద్యార్థికి ప్రవేశపత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement