● ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశం ● గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం ● విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి ● 18న అరణియార్ సందర్శనకు భూమన పిలుపు
‘‘అలవి కాని హామీలు గుప్పించి చంద్రబాబు అధికారం చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. అవినీతికి పెద్దపీట వేసి స్కామ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాట పటిమను ప్రదర్శించాలి. పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో దించాలి. చంద్రబాబు అక్రమాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి. సర్కారు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’’ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలకు దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల సమన్వయకర్తలు
తిరుపతి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని ఢీకొట్టేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ జగనన్న చేసిన పనులను సైతం తన ఖాతా వేసుకుని క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రధాన అస్‌త్రంగా మార్చాలని కోరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ మాట్లాడుతూ సమన్వయకర్తలు విస్తృతంగా పర్యటించి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పార్టీ నేతలు చూపించిన చొరవను స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని జగనన్నకు కానుకగా అందించాలని సూచించారు.
వెన్నుపోటు బాబు నైజం
వెన్నుపోటు అనేది చంద్రబాబు సహజ నైజమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లోకేష్ నుంచి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు డీఎస్సీ అక్రమాలకు లీక్ చేసింది చంద్రబాబే అని ఆరోపించారు.
బాబు పాలనలోనే కరువు
చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని, ఈ కరువు తీరాలంటే బాబు ప్రభుత్వం పోవా లని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్లా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం లేకుండా చూస్తానని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్ మాట్లాడుతూ పార్టీని విజయం దిశగా నడిపిస్తామన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి, చంద్రగిరి, జీడీనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, నూకతోటి రాజేష్ మాట్లాడారు.
గుర్తింపు కార్డుల పంపిణీ
పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నేతలందరికీ గుర్తింపు కార్డులు అందించనున్నట్లు భూమన వెల్లడించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ పాల్గొన్నారు.
విజయకేతనం ఎగురవేద్దాం
తిరుపతి మంగళం : స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలంతా సిద్దం కావాలని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి ఎయిర్‌బైపాస్‌రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎంపీ, ఎమ్మెల్సీ, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌తో అధికారంలోకి వచ్చారనే విషయం ప్రపంచమంతా తెలుసునన్నారు. నోటికి వచ్చినట్లుగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ 114 అబద్ధపు హామీలు గుప్పించి ప్రజలను వంచించారని విమర్శించారు. అందుకే స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. సమన్వయకర్తలు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసేందకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డే అభ్యర్థులను బరిలోకి దింపాలని కోరారు.
సీమకు తీరని అన్యాయం
ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ నుంచి కీలక సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీతో పాటు 16 మేజర్ ఇన్‌స్టిట్యూట్‌లు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తూ పేదల ఆర్థికాభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, జగనన్న రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఈవీఎంలను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో మరోసారి కుట్రలకు తెగబడితే కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


