మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో కూల్చివేతలు | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో కూల్చివేతలు

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే

తొలగింపు

లబోదిబోమంటున్న బాధితులు

చంద్రగిరి: మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో చేస్తున్న అరాచకంతో పేద ప్రజలకు నీడలేకుండా పోయింది. తిరుచానూరులో మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా, అభివృద్ధి పేరిట రోడ్డు వెడల్పునకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సర్వే నంబరు 457, 458లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలపై జులుం ప్రదర్శించారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతంలోని కాలువ పోరంబోకు అంటూ కూల్చేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల క్రితం కూడబెట్టిన డబ్బుతో చేసి కొనుగోలు చేసిన స్థలంలో అప్పు చేసి ఇళ్లను నిర్మించుకుంటే ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో ధ్వంసం చేయడమేంటని ఆవేదన చెందుతున్నారు. తమకు కొనుగోలు చేసే సమయంలో ఈ ప్రాంతం నదీ పరివాహక ప్రాంతమని తెలియదని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, విద్యుత్‌ బిల్లులు కట్టుకుండా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. అయితే ఇప్పుడు అభివృద్ధి పేరుతో మా ఇళ్లను ధ్వంసం చేస్తే ఎలా బతకాలంటూ మండిపడుతున్నారు. అభివృద్ధి పేరుతో అధికారులు చేస్తున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం ఇవ్వకుండానే..!

తరాల నుంచి వస్తున్న వ్యవసాయ పొలాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను సైతం ప్రభుత్వం నిలువునా ముంచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీకేటీ భూములను సాకుగా చూపి బాధితులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే లాక్కొనేందుకు యత్నిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందిన ప్రహరీగోడలను సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదల ఇళ్లను పడగొట్టిన అధికారులు

ముందస్తు సమాచారం లేకుండానే..

ఇళ్లు, ప్రహరీగోడలను కూల్చేస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రజలు మండిపడుతున్నారు. చట్టప్రకారం ఏదైనా ఆస్తులు ధ్వంసం చేయాలంటే ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు మెప్పుకోసం పేదల జీవితాలను రోడ్డున పడేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై వామపక్షాలు, మానవహక్కుల సంఘాలు సైతం పోరాటాలకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement