సెల్‌ రేగిన చోరులు! | - | Sakshi
Sakshi News home page

సెల్‌ రేగిన చోరులు!

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

వీకేఆర్‌వై కాలనీలో నెలకు 200 ఫోన్లు అపహరణ దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న కార్మికులు

పరిశ్రమలలో పనిచేసే కార్మికులతో కళకళలాడే కాలనీ ఇప్పుడు దొంగల స్థావరంగా మారింది. వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరు పంచాయతీ పరిధిలోని వీకేఆర్‌వై కాలనీలో సెల్‌ ఫోన్‌ చోరుల ముఠా హల్‌ చల్‌ చేస్తోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రెచ్చిపోతోంది.నెలకు సగటున 200కి పైగా ఫోన్లు అపహరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

వరదయ్యపాళెం : ఏపీఐఐసీ పరిధిలో అపోలో టైర్లు, హీరో మోటార్స్‌తో పాటు పలు పరిశ్రమలు ఉండటంతో వందలాది మంది కార్మికులు వీకేఆర్‌వై కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిలో అత్యధికులు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన వారే. ఇదే అదునుగా చేసుకున్న దొంగల ముఠా.. తలుపు గడియ పెట్టకపోతే చాలు, ఇంట్లోకి దూరి చార్జింగ్‌లో ఉన్న ఫోన్లను, టేబుల్‌పై ఉన్న ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తోంది.

భాష రాదు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు

బాధితుల్లో ఎక్కువ మంది హిందీ మాట్లాడే వారు కావడం, ప్రాంతం కొత్త కావడంతో ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. కొందరు భయంతో ఫిర్యాదు కూడా చేయడం లేదు. దీంతో దొంగల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి.

చిన్నపాండూరు పంచాయతీలో దొంగల బెడద

నిఘా వ్యవస్థ విఫలం

ఈ ప్రాంతం మొత్తం శ్రీసిటీ హైటెక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఇద్దరు ఎస్‌ఐలు, ఒక సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు, సిబ్బంది ఉన్నా దొంగలను పట్టుకోలేకపోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వ్యవస్థ విఫలమైందని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇప్పటికై నా పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగల ముఠాను పట్టుకోకపోతే కార్మికుల్లో భయాందోళనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement