తిరుపతి అర్బన్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దళారీల గుప్పిట్లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దళారీలతో కుమ్మకై ్క అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. గత రబీ సీజన్‌లో 1.40 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. ఈ ఖరీఫ్‌లో 1.10 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఈ ఏడాదిలో రెండు సీజన్లకు సంబందించి 2.50లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఇందులో 20శాతం వరకు ధాన్యాన్ని సుమారు 30 ఏళ్లుగా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కొనుగోలు చేసేది. అయితే ఏడాది క్రితం నుంచి ఏపీ సీడ్స్ నష్టాల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసింది. కేవలం విత్తనాలు మాత్రమే పంపిణి చేస్తామని స్పష్టం చేసింది. ఇదే వ్యాపారులు, దళారీలకు వరంగా మారింది. తాము చెప్పిందే రేటు అన్నట్లు రైతులను దగా చేసేస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొల్లగొడుతున్నారు.
వ్యాపారులు చెప్పిందే వేదం
వ్యాపారులు గతంలో బస్తా ధాన్యం( 75 కేజీలు) కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 72 గంటల్లోనే రైతుకు నగదును ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం బస్తా ధాన్యం 80 కేజీల లెక్కన మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో రైతులు బస్తాపై 5 కేజీలు నష్టపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ధాన్యం నెమ్ముగా ఉందని, దాంతోనే 5 కేజీలు అదనంగా వేసుకుంటున్నామంటూ తెగేసి చెబుతున్నారు. కాదంటే తమ ధాన్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు చేసేదిలేక విక్రయిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నగదు ఇవ్వడానికి రెండు వారాలు సమయం పడుతుందని దళారీలు ముందే చెప్పేస్తున్నారు. తీరా నగదు ఇచ్చే సరికి నాలుగు వారాలు సమయం పడుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.


