నిర్లక్ష్యం వహిస్తే జాబితాలో పేరు గల్లంతు
సెప్టెంబర్ 15లోపు దశలవారీగా విచారణ
అక్టోబర్ 3న ఓటరు తుది జాబితా
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది. ప్రస్తుతం సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతు న్న నేపథ్యంలో ఆదమరిస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదముంది. ప్రధానంగా నోటీసు అందుకున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. విచారణ తప్పనిసరిగా హాజరై గుర్తింపు కార్డును చూపించి ఓటును కాపాడుకోవాల్సిప ఆవశ్యకత ఏర్పడింది. ఏమాత్రం అలసత్వం వహించినా జాబితాలో పేరు చోటు దక్కని పరిస్థితి తలెత్తుతుంది.
తిరుపతి అర్బన్ : స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్ ) ప్రక్రియలో భాగంగా మొదటి దశలో ఇంటింటా సర్వేను బీఎల్‌ఓల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రెండో దశలో 4,01,210 మంది ఓటర్లకు సంబందించి మ్యాపింగ్‌కాకపోవడంతో ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు సరైన గుర్తింపుకార్డులతో హజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 2.70లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారికి ఈ నెల 29వ తేదీకి నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం దశల వారీగా సెప్టెంబర్ 15 వరకు హియరింగ్‌లో భాగంగా దశల వారీగా ఓటర్లను ఓ చోటకు పిలిపించి సరైన గుర్తింపు కార్డుల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను వెల్లడించడానికి జోరుగా కసరత్తు చేస్తున్నారు. అయితే నోటీసులు అందుకున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. విచారణకు తప్పకుండా హజరుకావడంతోపాటు సరైన ధ్రువీకరణపత్రాలను సమర్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన హియరింగ్స్‌కు సంబందించి 1.20లక్షల మంది ఓటర్లు హజరుకాలేదని చర్చసాగుతోంది. విచారణకు హాజరుకాని వారికి మరో అవకాశం ఇస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం పలువురిలో ఆందోళన కలిగిస్తోంది.
14 లక్షలకు తగ్గిన ఓట్లు
ఓటర్ల సర్వే చేపట్టిన క్రమంలో మొదటి నుంచి గందరగోళం తప్పడం లేదు. ఇంటింటా సర్వేలో రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉంటే...కొందరికి ఒకటే ఇవ్వడంతో పలు ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిరాకపోవడంతో మరిన్ని సమస్యలు ఏర్పడ్డాయి. జిల్లాలో సర్‌కు ముందు 17,69,429 ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ముసాయిదా జాబితాలో 14,81,603 మంది ఓటర్లు మాత్రమే తేలారు. అంటే 2,87,826 ఓట్లు తగ్గిపోయాయి. మరోవైపు ఓటర్లు సక్రమంగా మ్యాపింగ్ కాలేదని, పేర్లులో పలు తప్పులు ఉన్నాయంటూ 4,01,210 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 75శాతం మేరకు నోటీసులు ఇచ్చేశారు. అయితే నోటీస్ అందుకోవాల్సిన ఓటర్ ఇంటి వద్ద లేకుంటే పక్క ఇంటి వారికి, లేదా ఎదురు ఇంటి వారికి ఇచ్చి వెళ్లడంతో పలు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా నోటీసులు ఇచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల గడువు ఇచ్చిన హియరింగ్‌కు వారు కేటాయించిన ఓ ప్రదేశానికి సరైన ధృవపత్రాలతో హజరుకావాలని సూచన చేస్తున్నారు. అయితే 60శాతం మంది ఓటర్లు వివిధ కారణాలతో హజరుకావడం లేదు. దీంతో వారి ఓట్లకు భద్రత ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నోటీసు అందుకున్న ఓటర్లు అప్రమత్తం


