తిరుపతి తుడా : శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మూడేళ్లపాటు స్విమ్స్ సంచాలకుడు, ఉపకులపతిగా సంతృప్తికరంగా సేవలు అందించానని ఈ అవకాశాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని డాక్టర్ ఆర్‌వీ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం పద్మావతి ఆడిటోరియంలో డాక్టర్ ఆర్‌వీ కుమార్ వీడ్కోలు సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తన హయాంలో స్విమ్స్ అభివృద్ధి కోసం టీటీడీ నుంచి వచ్చే ఆర్థిక సహాయం రూ.130 కోట్లకు పెరిగిందని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటీవల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా మెడికల్, పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని చెప్పారు. వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేసి అందరూ గర్వపడేలా సంస్థను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనను వైధ్యాధికారులు, అన్ని విభాగాధిపతులు, డాక్టర్లు, ఉద్యోగులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. సిమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్ల, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, న్యూరో సర్జరీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్ప కడియాల, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనజాక్షమ్మ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శర్వాణి, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.


