పేదల ఇళ్లు నేలమట్టం | - | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లు నేలమట్టం

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

● లబోదిబోమన్న బాధితులు

చంద్రగిరి : ఏళ్ల క్రితం నివాసాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేదల ఇళ్లపై రెవెన్యూ అధికారులు జులుం ప్రదర్శించారు. కోర్టు ఉత్తర్వులు, కలెక్టర్‌ ఆదేశాలతో ఇళ్లను నేలమట్టం చేశారు. వివరాలు.. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె పంచాయతీ కూచువారిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన 26 మంది దళితులకు సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేసింది. దీంతో వారు అక్కడే శాశ్వత గృహాలను నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నంబర్‌ 362/2లో 3.49 ఎకరాల కాలువ పొరంబోకు స్థలంలో 26 మంది గృహాలను నిర్మించుకొని ఉన్నారని, నీటిపారుదలకు కాలువ లేకుండా చేశారని గ్రామానికి చెందిన చంగల్రాయలు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలు, కలెక్టర్‌ ఉత్తర్వులు మేరకు చంద్రగిరి తహసీల్దార్‌ అమరేశ్వరి పోలీసు బలగాలను తీసుకెళ్లి ఐదు ఇళ్లను తొలగించారు. ఇల్లు కోల్పోయి వీధిన పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వానికి కూడా పన్నులు సైతం చెల్లిస్తుంటే ఇప్పుడు తొలగించడం దారుణమంటూ వాపోయారు. చంద్రగిరి మండలంలో అనేక వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పేదల ఇళ్లను కూల్చేయమని ఏ ప్రభుత్వం చెప్పిందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా ఇళ్లను కూల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్‌ అమరేశ్వరి మాట్లాడుతూ.. కోర్టు, కలెక్టర్‌ ఆదేశాల మేరకే ఆక్రమణలు తొలగించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement