తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటులు ప్రభు, తిరువేర్ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
ముక్కంటి సేవలో..
శ్రీకాళహస్తి: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు.
ఆశాజనకంగా ఇంటర్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నాయని ఆర్‌ఐఓ జి.గోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు. గత ఏడాది కంటే 10శాతం ప్రవేశాలు పెరిగాయని, అధ్యాపకులు మరింత ఉత్సాహంతో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరగడానికి మధ్యాహ్న భోజన పథకం, విద్యామిత్ర స్కీమ్‌లో భాగంగా ఉచిత పుస్తకాల పంపిణీ, స్టడీమెటీయల్స్, తల్లికివందనం, ప్రవేశాల పెంపునకు ప్రత్యేక ప్రణాళికతో అధ్యాపకుల కృషి కారణమని వివరించారు.


