తిరుపతి అన్నమయ్యసర్కిల్ : గుమ్మిడిపూండి–గూడూరు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. బుధవారం ఈ మేరకు కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రాజెక్టు మొత్తం 90 కిలోమీటర్ల పొడవుతో, రూ.2,229 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారన్నారు. ఈ పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్ల నిర్మాణంతో చైన్నె, గూడూరు, రేణిగుంట మార్గంలో రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా గూడూరు చైన్నె, విజయవాడ, రేణిగుంటను అనుసంధానించే కీలక రైల్వే జంక్షన్ కావడంతో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఇందులో స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల మెగా బ్రిడ్జితో పాటు 21 ప్రధాన వంతెనలు, 127 చిన్న వంతెనలు, 34 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారని వివరించారు.
ప్రాణదాన ట్రస్ట్‌కు
రూ.15 లక్షల విరాళం
తిరుమల : హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పి.శిల్పా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంపతులు బుధవారం శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.15 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.
22న ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తిలక్‌రోడ్ ఎస్‌బీబీ మెడికేర్ వద్ద ఈ నెల 22వ తేదీన ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం బుధవారం తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, ఎంపీఏ చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు. ఎస్‌బీబీ మెడికేర్ పరిధిలో లోకల్ జాబ్స్ ఉంటాయని వెల్లడించారు. రూ.12,500 నుంచి రూ.25వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. అర్హులైనవారు నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9177508279, 9347508876, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


