ఆరు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
తిరుపతి క్రైం : తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని సోనోవిజన్‌న్ మొబైల్ షోరూమ్‌లో జరిగిన భారీ చోరీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఆరు రోజుల్లోనే ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సినీఫక్కీలో షోరూమ్ గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను అపహరించారు. చోరీ సొత్తును బంగ్లాదేశ్‌కు తరలించే ప్రయత్నంలో ఉన్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా సమీపంలో పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు ఓ రిసీవర్‌ను అరెస్ట్ చేసి, వారి నుంచి 175 మొబైల్ ఫోన్లు, ఐదు యాపిల్ ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమాచారంతో తిరుపతిలో మరో నిందితుడిని అరెస్ట్ చేసి 20 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 8న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై వెంటనే జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు స్పందించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును పర్యవేక్షించారు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్ ఇన్‌న్‌చార్జి) ఆర్ల శ్రీనివాసులు, తిరుమల అడిషనల్ ఎస్పీ ఐ.రామకృష్ణ, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.
జార్ఖండ్ నుంచి బంగ్లాదేశ్‌కు
దేశంలోని పెద్ద మొబైల్ షోరూమ్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ముఠాల కదలికలపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను జార్ఖండ్, నాగ్‌పూర్, పశ్చిమబెంగాల్‌కు పంపించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితులు చోరీ సొత్తుతో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతానికి తరలివెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాల్దా ప్రాంతానికి చేరుకుంటున్న వారి కదలికలను పసిగట్టిన ప్రత్యేక బృందాలు పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా సమీపంలో అదుపులోకి తీసుకున్నాయి. సమాచారంతో టోనిక్ షేక్ సోదరుడు అనికుల్ షేక్‌ను మంగళవారం ఉదయం తిరుపతి–రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి ఆస్పత్రి సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మరో 20 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 195 మొబైల్ ఫోన్లు, ఐదు యాపిల్ ట్యాబ్‌లు పోలీసుల చేతికి చిక్కాయి.
రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం
ఐదుగురు అరెస్ట్
ఈ కేసులో ఆలమ్‌షేక్ (49), ఎం.డి.బసీరుద్దీషేక్ (66), టోనిక్ షేక్ (32), ఎం.డి.అష్మౌల్ హక్ అలియాస్ సోహెల్ (34), అనికుల్ షేక్ (సుమారు 26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అష్మౌల్ హక్ రిసీవర్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును స్వల్ప వ్యవధిలో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.
పలు రాష్ట్రాల్లో నేర చరిత్ర
దర్యాప్తులో నిందితులు జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందినవారని, ఒక ముఠాగా ఏర్పడి పెద్ద మొబైల్ షోరూమ్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. చోరీ చేసిన సొత్తును పశ్చిమబెంగాల్‌లోని తమ పరిచయస్తుల ద్వారా మాల్దా ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి బంగ్లాదేశ్, నేపాల్‌కు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు ఆలమ్ షేక్ (49)పై జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 12 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లో అతనిపై గ్యాంగ్‌స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్‌న్) చట్టం కింద కేసు నమోదై, సుమారు రెండేళ్లపాటు జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


