తిరుపతి రూరల్: ‘రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు.. ఐదేళ్లలో 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తాం..’ అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసి యువతను, నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని పాతాళానికి తొక్కేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్న బిల్ కలెక్టర్లకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలనే ఊడబీకే స్థాయికి దిగజారిందని ధ్వజమెత్తారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌లో 35 ఏళ్లుగా బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయడం దారుణమన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందిందన్న సాకుతో సుమారు 100 మంది బిల్‌కలెక్టర్లను రోడ్డున పడేయడం, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీరు విధులకు రావొద్దని నోటీసు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నట్టు భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి 300 కుటుంబాల ఉపాధిని లాక్కోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. శ్రామిక జీవుల పొట్టకొట్టే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని భూమన హెచ్చరించారు. బిల్ కలెక్టర్ల జీవితాలతో చెలగాటమాడితే వైఎస్‌ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.


