తిరుపతి మంగళం : భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాఽథ్‌రెడ్డితో పాటు మరికొంతమంది అనుచరులు మంగళవారం తిరుపతి మారుతీనగర్‌లోని పెద్దిరెడ్డి నివాసంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టి శబరిమలకు బయల్దేరారు.
శ్రీవారి సేవలో రప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం భారత క్రికెటర్ తిలక్ వర్మ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హర్షవర్దన్ నారాయణ సింగ్, ఎంపీ చింతకాయల విజయ్, సినీ నటుడు సాయిధ మ్ తేజ, ఎంపీ తనూజరాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పా ట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
మంచినీళ్లు అడిగి..
– మహిళ మెడలో గొలుసు అపహరణ
వెంకటగిరి రూరల్: మంచినీళ్లు కావాలంటూ గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రైతుసేవా కేంద్రంలోకి వచ్చి ఒంటరిగా విధుల్లో ఉన్న వీఐఏ మెడలో ఉన్న బంగారు కొలుసును అపహరించుకు పోయారు. ఈ ఘటన వెంకటగిరి మండలంలోని పెట్లూరు సచివాయల పరిధిలోని రైతుసేవ కేంద్రం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వరూప కథనం మేరకు.. మండలంలోని మొగళ్లగుంట గ్రామ సమీపం వద్ద ఉన్న పెట్లూరు రైతుసేవా కేంద్రంలో వరలక్ష్మి వీఐఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) ఒంటరిగా విధులు నిర్వహిస్తోంది. వెంకటగిరి నుంచి నాయుడుపేట వెళ్లే మార్గంలో ఓ కారులో ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్నం 3.30 గంటలకు రైతుసేవా కేంద్రం వద్దకు చేరుకుని వరలక్ష్మిని తాగేందుకు మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు లేవు అని చెప్పడంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పంపించేశారు. ఐదు నిమిషాల వ్యవధిలో ఆ ఇద్దరుతోపాటు మరోవ్యక్తి తోడై ముగ్గురూ ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి వరలక్ష్మి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌ను అపహరించుకునే యత్నం చేశారు. వరలక్ష్మి కేకలు వేయగా సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి బంగారు చైన్‌తో ఆ ముగ్గురు వ్యక్తులు కారులో నాయుడుపేట వైపు ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ స్వరూప తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి యత్నించిన యువతి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని తహనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తహనగర్ గ్రామానికి చెందిన పావని(22) శ్రీసిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. జీవితంపై విరక్తి చెంది సోమ వారం పురుగుల మందు తాగింది. కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం తమిళనాడుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.


