సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘పోలీసుల దాష్టీకానికి దళిత నిరుపేదకు చెందిన వెయ్యి బాతు పిల్లలు మృత్యువాత పడ్డ ఘటన ఏర్పేడు మండలం కందాడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. ఏర్పేడు మండలం, కందాడ దళితవాడకు చెందిన కె.మోహనమ్మ పేరుతో సర్వే నం.421–1లో ఒక ఎకరం డీకేటీ పొలం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందజేశారు. అప్పటి నుంచి మినుములు సాగు చేస్తున్నారు. వీరి పొలం గుండా పైపొలాలకు దారిని కొందరు రైతులు దౌర్జన్యంగా ఏర్పాటు చేయడంపై 2018 నుంచి బాధిత కుటుంబం పోరాడుతోంది. మోహనమ్మ కుమారులు హరి, సురేష్ బాతులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పది రోజుల కిందట మళ్లీ తన పొలంలో దారి ఏర్పాటు చేసి రాళ్లు తోలడంతో ఈ విషయాన్ని మోహనమ్మ కుమారుడు సురేష్ స్థానిక వీఈర్‌వో తులసమ్మకు ఫిర్యాదు చేశాదు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన విధులకు ఆటంకం కలిగించారని వీఆర్‌వో ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 14, 15 తేదీలలో హరి, సురేష్‌ను ఏర్పేడు పోలీసులు స్టేషన్‌కు పిలిచి రాత్రి వరకు బలవంతంగా స్టేషన్లో కూర్చోబెట్టి చీకటి పడ్డాక ఇంటికి పంపారు.
రూ.1.7 లక్షలు నష్టం
అయితే సురేష్ ఈనెల 14,15 తేదీలలో పోలీస్ స్టేషన్‌లోనే ఉండడంతో బాతులకు నీళ్లు, మేత పెట్టేవారు లేక ఇంటి వద్ద వెయ్యికి పైగా బాతు పిల్లలు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ సుమారు రూ.1.7 లక్షలు ఉంటుందని బాధితుడు సురేష్ వాపోతున్నాడు. రాజకీయ జోక్యంతో తనపై కక్షగట్టి, పోలీస్ స్టేషన్‌లో పెట్టారని సురేష్, హరి కన్నీటి పర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయానికి పరిష్కారం చూపాలని, ఏర్పేడు పోలీసుల తీరుపై బాధితులు సురేష్, హరి మంగళవారం తిరుపతి ఎస్‌పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.


