తలనొప్పిగా మారిన లీప్‌ యాప్‌.. | - | Sakshi
Sakshi News home page

తలనొప్పిగా మారిన లీప్‌ యాప్‌..

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

● పాఠాలను పక్కనపెట్టి.. వివరాల నమోదులో ఉపాధ్యాయులు ● అరకొర బోధనతో పడిపోతున్న విద్యా ప్రమాణాలు ● చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న గురువులు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తాము అధికారంలోకి వస్తే విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల ప్రచార వేదికల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వీరి పరిపాలనా తీరుతో విద్యాప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు డేటా నమోదు చేస్తూ, బిల్లులు తయారు చేస్తూ, స్ప్రెడ్‌ షీట్లు నింపుతూ తరగతి గదులను వదలిపెట్టి బోధనేతర పనులు నిర్వర్తిస్తున్నారు.

బోధనకు సమయమేదీ..?

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం. విలువలను నేర్పించి సమాజానికి చక్కటి పౌరులను అందించడం. అయితే అదే ఉపాధ్యాయుడు నేడు తన అసలు బాద్యతకు సమయం దొరకని దుస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వాలు ప్రతి సమస్యకు ఉపాధ్యాయుడినే పరిష్కారంగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉదయం పాఠశాల ప్రారంభమైన క్షణం నుంచి ప్రార్థన, విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు నమోదు, పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలు సేకరించడం, రాగి జావ పంపిణీ, మధ్యాహ్న బోధన ఏర్పాట్లు పర్యవేక్షణ, ఈ భోజన వివరాల ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌, పరిశుభ్రత తనిఖీలు, దీంతోనే సగం సమయం గడుస్తోంది. దీనికితోడు ఎండీఎం ఫీడ్‌ బ్యాక్‌ అంటూ ఆయా పాఠశాలల్లోని ఒక టీచర్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆ టీచరు వెళ్లి మధ్యాహ్న భోజనం రుచి, శుచిలను పరిశీలించి లీప్‌ యాప్‌లో నమోదు చేయాలి. అలాగే ప్రతి రోజు పాఠశాలకు గైర్హాజరయ్యే ప్రతి విద్యార్థి ఏ కారణంతో హాజరుకాలేదనే వివరాలను సైతం అప్‌లోడ్‌ చేయాలి. ఈ పనులన్నింటి మధ్యలో అవకాశం లభిస్తే ఒక తరగతికి పాఠం చెప్పడమే ఉపాధ్యాయుడికి గగనమవుతోంది. బోధనేతర పనుల కారణంగా తరగతి గదికి వచ్చే వెసులుబాటే ఉండడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

భారం..

బోధనేతరం

లీప్‌ యాప్‌ పేరుతో టీచర్లకు

కొత్త ఇబ్బందులు

మెమో భయం

ఓ వైపు పాఠశాలకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. మరో వైపు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో వివరాలకే సమయం సరిపోతుంటే నాణ్యమైన విద్యాబోధన ఎలా సాధ్యమని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు వివరాలను నమోదు చేయలేకపోయినా, అటు విద్యాప్రమాణాలు తగ్గినా రెండింటికీ తమనే బాధ్యులను చేస్తూ మెమోలు ఇస్తున్నారని చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అత్యధిక నష్టం విద్యార్థులకేనని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సక్రమంగా ఆలోచించి ఆన్‌లైన్‌ వివరాల నమోదుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

సరస్వతీ నిలయాలను ప్రభుత్వం సాంకేతిక చట్రంలో ఇరికించింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్చేసింది. సంస్కరణ పేరుతో లీప్‌ యాప్‌ను తీసుకువచ్చి వివరాల నమోదు పేరుతో వేధిస్తోంది. ఈ క్రమంలో టీచర్లు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. బోధనేతర బాధ్యతలే భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్‌ పూర్తి చేయాల్సిన సమయంలో సెల్‌ఫోన్‌ పట్టుకుని తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. పేద బిడ్డల భవితను చంద్రబాబు సర్కారు చేజేతులా నాశనం చేస్తోందని మండిపడుతున్నారు. పైగా ఏమాత్రం విద్యా ప్రమాణాలు తగ్గినా మెమోలు జారీ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.

ఇది వరకు ఒక్కో పని వివరాలను ఒక్కో యాప్‌లో నమోదు చేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం లీప్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అన్ని పనులకు సంబంధించిన వివరాలను ఈ ఒక్క యాప్‌లోనే వివిధ పోర్టళ్లలో నమోదు చేయాలని ఆదేశించింది. ఒకే వివరాలను రెండు మూడు పోర్టళ్లల్లో అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో ఉపాధ్యాయులకు ఈ యాప్‌ పెద్ద తలనొప్పిగా మారింది.

మానసిక ఒత్తిడి

ఉపాధ్యాయుడు పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి యాప్‌లతో సమయం సరిపోతోంది. ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల నుంచి ప్రతి చిన్న పనిని లీప్‌ యాప్‌లో నమోదు చేయాలంటూ ఒత్తిడి. సమయానికి నమోదు చేయకుంటే మెమో ఇస్తారనే భయంతో మానసికంగా కుంగిపోతున్నాం.

– ఎస్‌.వెంకటముని,

జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌

నాణ్యమైన విద్య అసాధ్యం

బోధన సమయమంతా యాప్‌లో వివరాల నమోదుకే సమయం సరిపోతుంటే నాణ్యమైన విద్య అసాధ్యం. క్షేత్ర స్థాయిలో విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే టీచర్లను బోధనకే పరిమితం చేయాలి. బోధనేతర పనులకు పరిపాలనా సహాయకులను అన్ని పాఠశాలలకు ప్రభుత్వం నియమించాలి.

– ఎస్‌.బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం

ఇదేనా సంస్కరణ

ఇప్పుడు అన్నింటిని ఒకే యాప్‌లోకి తీసుకొచ్చి సంస్కరణ చేశామని, పనిభారం తగ్గించామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఒకే యాప్‌లోనే ఒకే వివరాలను వివిధ పోర్టళ్లలో నమోదు చేయాల్సి రావడంతో మరింత పనిభారం పెరిగింది. ఇదేనా సంస్కరణ.

– చల్లా శ్రీనివాస్‌యాదవ్‌,

జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement