ఉసురు తీస్తున్న ఊపిరి! | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న ఊపిరి!

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

● స్టీల్‌ పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం ● రోగాల బారిన పెన్నేపల్లె, శిరసనంబేడు ప్రజానీకం ● మళ్లీ 148.98 ఎకరాల భూసేకరణ కోరిన ఫ్యాక్టరీ యాజమాన్యం ● కాలువ ఆక్రమణ, పొల్యూషన్‌పై ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం

పారిశ్రామికాభివృద్ధి అవసరమే.. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే.. రాష్ట్రానికి ఆదాయం వచ్చేందుకు పరిశ్రమలను తీసుకురావాల్సిందే. అయితే ఆయా ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై కూడా పాలకులు దృష్టి సారించాలి. వాతావరణం కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలి. ప్రధానంగా కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ, పెళ్లకూరు మండలం పెన్నేపల్లె, శిరసనంబేడులోని స్టీల్‌ పరిశ్రమల కారణంగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగాల సంగతి దేముడెరుగు.. శ్వాసకోస వ్యాధులతో అల్లాడిపోతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషవాయువులతో ఊపిరి పీల్చుకునేందుకు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు మృత్యువాత పడుతున్నారు.

పెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లె, శిరసనంబేడు వద్ద నెలకొల్పిన స్టీల్‌ పరిశ్రమల నుంచి విష వాయువులు విడుదలవుతున్నాయి. దీంతో స్థానికులు అనేక వ్యాధులు బారిన పడుతున్నారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి దొరుకుతుందనే ఆశ ఉన్నప్పటికీ దట్టమైన పొగ కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పచ్చని పాలాలు, కళకళలాడే చిట్టడవితో పాటు చుట్టు పక్కల గ్రామాలను సైతం ఈ పరిశ్రమల నుంచి వెలువడే దట్టమైన పొగ కమ్మేస్తోంది. పెన్నేపల్లి, శిరసనంబేడు సమీపంలో స్టీల్‌ పరిశ్రమల నుంచి నిరంతరంగా వెలువడుతున్న పొగ, వ్యర్ధాలతో సుమారు 6 నుంచి 8కిలోమీటర్లు మేర కాలుష్యం కమ్మేస్తుంది. పదిహేనేళ్లు కిందట ఏర్పాటు చేసిన ఇక్కడ స్టీల్‌ పరిశ్రమల యజమానులు గతంలో గొట్టాల ద్వారా పొగ విడుదల చేసేవారు. తర్వాత అదనపు ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పొగ నేరుగా గాలిలోకి వదిలేస్తున్నారు. అలాగే పరిశ్రమల వ్యర్ధాలు సైతం బయటకు విడిచిపెట్టేస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోలేక కష్టాలు పడుతున్నారు. కాలుష్యం కారణంగా పంటల దిగుబడి సైతం తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా పెన్నేపల్లి, కానూరు, తాళ్వాయిపాడు, శిరసనంబేడు, రాజుపాళెం, చెన్నప్పనాయుడుపేట, జీలపాటూరు తదితర గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయాయి. వ్యర్ధాలను చెరువులోకి, గ్రామ సమీపాల్లోనూ, వ్యవసాయ పొలాల్లోకి వదిలేయడంతో సాగు, తాగునీరు కలుషితమవుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం ద్వారా పలువురు రోగాల బారిన పడి మరణించినట్లు వెల్లడిస్తున్నారు.

భూసేకరణకు దరఖాస్తు

పెన్నేపల్లెలోని పరిశ్రమ యాజమాన్యం మరో 148.98ఎకరాలు భూములను సేకరించుకునేందుకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో 74.61పట్టా భూములు, 62.97ఎకరాలు అసైన్‌మెంట్‌ భూములు, 7.53ఎకరాలు అసైన్‌మెంట్‌ ఫ్రీహోల్డ్‌ భూములు, 3.87ఎకరాలు ప్రభుత్వ భూములు మొత్తం 148.98ఎకరాలు భూసేకరణ కోసం పరిశ్రమ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది.

కార్మికులకు రక్షణ కరువు

శిరసనంబేడు, పెన్నేపల్లెలోని స్టీల్‌ పరిశ్రమలలో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు రక్షణ లేదు. ప్రమాదకరమైన యంత్రాల వద్ద పని చేస్తున్న కార్మికులకు రక్షణ కవచాలు అందుబాటులో లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ప్రమాదాల బారిన పడి అనేక మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే కార్మికుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా మండే కొలిమిలో పడేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు

పరిశ్రమల కారణంగా తలెత్తిన కాలుష్యంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ పంట కాలువను పరిశ్రమ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇరిగేషన్‌ శాఖకు నివేదించారు. అయినప్పటికి నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోకుండా తాయిలాలతో సరిపెట్టుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అందుబాటులో లేరు

స్టీల్‌ పరిశ్రమల కారణంగా వాతావరణ కాలుష్యంపై వివరణ కోరేందుకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులను ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement