జాతీయ రహదారి పక్కనే యథేచ్ఛగా దందా ఎన్‌హెచ్ కాంక్రీట్ గోడలు కూల్చివేసి తవ్వకాలు పట్టించుకోని అధికారులు ఆర్‌డీఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటున్న స్థానికులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచుకుంటూనే ఉన్నారు. చివరకు జాతీయ రహదారిని సైతం వదలకుండా దందా సాగిస్తున్నారు. పచ్చమూక అక్రమార్జనకు ఎన్‌హెచ్ అధికారులు సైతం వంతపాడుతున్నారు. మామూళ్ల మత్తులో అక్రమార్కులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌డీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే గోడలను కూల్చేసినా స్పందన కరువైందని మండిపడుతున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చెరువులు, గుట్టలను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రస్తుతం జాతీయ రహదారుల పక్కన నేషనల్ హైవే అథారిటీ సేకరించిన భూములను సైతం తవ్వేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాళెం రెవెన్యూ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1454లో భారీగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ తవ్వకాల కారణంగా జాతీయ రహదారి దెబ్బతినడమే కాకుండా, సమీపంలోని చర్చికి వెళ్లే ప్రధాన దారిని సైతం మూసివేశారు. మట్టి తవ్వకాల కోసం హైవేని ధ్వంసం చేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ దందాను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
స్పందన కరువు
నిత్యం వందలాది టన్నుల గ్రావెల్ తరలిపోతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే బాటలో నేషనల్ హైవే అధికారుల సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రయాణానికి ముప్పు వాటిల్లే అవకాశమున్నప్పటికీ స్పందించపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


