టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ ఆగడం
ఆధ్యాత్మిక నగరిని అరాచకాలకు అడ్డాగా మార్చేశారు. ప్రధానంగా టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ప్రతిష్టాత్మక తిరునగరంలో గూండా రాజ్యం నడిపిస్తున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తూ దాదాగిరీ చెలాయిస్తున్నారు. చివరకు తన అకృత్యాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలపై సైతం కేసుల్లో ఇరికించేందుకు తెగబడుతున్నారు. తన దౌర్జన్యాలను కవరేజ్ చేసేందుకు యత్నించిన జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా పోలీసులను ఉసిగొల్పి బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ప్రశాంత తిరుపతిలో రౌడీరాజకీయాలు సాగించి అశాంతిని రాజ్యమేలిస్తున్నారు.
పరామర్శ పేరుతో నాటకాలు!
తన ఇంటి ముందు నిరసన తెలిపిన మహిళలు, కవరేజ్ వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయించిన జేబీ శ్రీనివాస్‌ను పరామర్శించేందుకు కూటమి నేతలు రావడం చర్చనీయాంశమైంది. జేబీపై జరగని దాడి జరిగినట్లు.. ఆయనను ఒకరి తర్వాత ఒకరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పరామర్శిస్తూ డ్రామాలు మొదలు పెట్టడం గమనార్హం.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఈ క్రమంలోనే తన భర్త హత్య కేసులో నిందితులను జేబీ కాపాడుతున్నారని నిరసనకు దిగిన మహిళలను, కవరేజ్‌కు వచ్చిన కెమెరా మెన్లపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగని టీడీపీ మూకలు తమ పలుకుబడిని ఉపయోగించి.. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్లిన మహిళలు, కవరేజ్‌కు వెళ్లిన యూట్యూబ్ రిపోర్టర్‌పై హత్యాయత్నం కేసు నమోదుకు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాధితుల కథనం మేరకు .. 2019 డిసెంబర్ 21న రాత్రి సుమారు 8 గంటల సమయంలో తిరుపతి కొర్లగుంటలోని ఎస్‌కే ఫాస్ట్‌ఫుడ్స్ వద్ద పసుపులేటి మురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1గా నరసింహులు, ఏ2గా మల్లి సహా మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు సుపారీ హంతకులను రంగంలోకి దించి హత్యకు పాల్పడ్డారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌్ లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 548/2019గా నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం తిరుపతి నాలుగో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసుకు సంబంధించిన సాక్షులను టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ కిడ్నాప్ చేశారని మృతుడి భార్య సత్య ఆరోపించారు. సాక్షుల్లో ఒకరైన చిన్నా అనే వ్యక్తిని పోలీసులు పాత కేసులో విచారణ పేరుతో తీసుకెళ్లి జేబీకి అప్పగించారని ప్రచారం జరుగుతోంది. అయితే చిన్నాను మృతుడి బంధువులు తీసుకువచ్చి బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిసింది. కేసు గురువారానికి వాయిదా వేయడంతో చిన్నా తిరిగి నివాసానికి వెళ్లే సమయంలో మరోసారి కిడ్నాప్ చేసి, బెదిరించినట్లు సమాచారం. చివరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులే తనను కిడ్నాప్ చేశారని చిన్నాతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
న్యాయం కోసం మహిళ పోరాటం
కేసును నీరు గార్చేందుకు టీడీపీ నేత జేబీ ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న బాధిత మహిళ సత్య ఆవేదనకు గురైంది. బంధువులతో కలిసి గురువారం జేబీ శ్రీనివాసులు నివాసం వద్ద నిరసన చేపట్టింది. శాంతియుతంగా సత్య, బంధువులు జేబీ నివాసం ముందు నిల్చొని నిరసన తెలిపారు. సాక్షి కెమెరామెన్ కృష్ణ, స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్ అక్కడకు వెళ్లారు. వీడియోలు, ఫొటోలు తీస్తుండడం గమనించిన జేబీ అనుచరులు.. కెమెరాలను లాక్కునే ప్రయత్నం చేశారు. తాము జర్నలిస్ట్‌లమని చెబుతున్నా వినకుండా వారిపై దాడికి యత్నించారు. స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్‌ని బలవంతంగా జేబీ నివాసంలోకి తీసుకెళ్లి నిర్భందించారు. అక్కడ సునీల్‌ని తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. జేబీ అనుచరుల వీరంగం చూసి బాధిత మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు.
అక్రమ కేసు నమోదుకు ఒత్తిడి
బాధితులు, టీడీపీ గూండాల చేతిలో దెబ్బలు తిన్న సునీల్‌పై అక్రమ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బలమైన కేసులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికారం చేతిలో ఉంటే.. ఏమైనా చెయ్యొచ్చు అనేందుకు ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పరాకాష్టకు రౌడీ రాజకీయం
తిరుపతి రూరల్ : ‘‘తిరుపతిలో రౌడీ రాజకీయం పరాకాష్టకు చేరుకుంది.. శాంతియుతంగా నిరసన తెలిపిన బాధిత మహిళతో పాటు కవరేజీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతి నిధులపై భౌతిక దాడులు చేయడం, వారిపైనే కేసులు పెట్టించడం అత్యంత దుర్మార్గం.. మీడియా ప్రతినిధులు మర్డర్లు చేయడానికి వెళతారా..? ప్రశ్నించే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏమిటి..? ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? రాక్షసరాజ్యంలో ఉన్నామా..?’’ అంటూ వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నివాసం వద్ద బాధిత మహిళ నిరసన చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రేమ్, సుకుమార్‌ను తిరుపతి రూరల్ పోలీసుల అక్రమంగా అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఈ మేరకు వారిని భూమన అభినయ్ రెడ్డి పరామర్శించారు. ముందుగా చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌ను కలసి మీడి యా ప్రతినిధిపై కేసు పెట్టడం ఏమిటి..? ఆయన కవరేజీకి వెళితే చచ్చేలా కొట్టడమే కాకుండా, హత్యా యత్నం కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. జేబీ శ్రీనివాస్, అతడి అనుచరులు రౌడీయిజానికి పాల్పడుతుంటే అడ్డుకోలేక బాధితులపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతకు ముందు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఇరువురిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పడంతో అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అభినయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేసి, వారిపైనే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. వారిపై కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు భూమన అభినయ్‌రెడ్డి చేరుకోవడం, ఆ వెంటనే జేబీ శ్రీనివాస్ ముఖ్య అనుచరులు అక్కడకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ీఅయితే దాడికి పాల్పడిన వారే కట్లు కట్టుకుని ఫిర్యాదు చేయడానికి రావడం విశేషం.
నగరంలో నిరసన ర్యాలీ
మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన జేబీ శ్రీనివాస్, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అభినయ్‌రెడ్డి ర్యాలీ చేపట్టారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీని కొనసాగించారు.


