తిరుపతి క్రైమ్ : అంతర్రాష్ట్ర గజదొంగను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.14.87 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు చెందిన కరక రాజాబాబు (47) వ్యసనాలకు బానిసై రైళ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడన్నారు. గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిందితుడిపై 80కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇటీవల వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 400 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ కేసులను ఛేదించిన ఏఎస్పీ శ్రీనివాసులు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, వెంకటగిరి సీఐ రోశయ్య, ఎస్‌ఐ టి.స్వరూప్, బాలాయపల్లె ఎస్‌ఐ డి.సురేష్‌బాబు, డక్కిలి ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్‌ను ఎస్పీ అభినందించారు.


