తిరుపతి రూరల్ : క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుందని, మరింత సమర్థవంతంగా సేవలందించగలరని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించిన 48వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. అథ్లెటిక్స్ విభాగంలో తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలవగా, కర్ణాటక రెండు, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానాల్లో నిలిచాయి. బ్యాడ్మింటన్‌లో తమిళనాడు, చెస్‌లో తెలంగాణ, క్యారమ్స్‌లో తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు సీఏండీ శివశంకర్ , డైరెక్టర్ గురవయ్య ట్రోఫీలు అందజేశారు. స్పోర్ట్స్ కౌన్సిల్‌కు విశిష్ట సేవలు అందించిన ఎం. కృష్ణారెడ్డి, పురుషోత్తానికి జ్ఞాపిక అందించారు. డైరెక్టర్ కె. రామమోహన్‌రావు, చీఫ్ జీఎంలు మురళీకుమార్, సీహెచ్ రామచంద్ర రావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వి. చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్
వెంకటగిరి రూరల్ : పట్టణంలోని సున్నపు వీధికి చెందిన శాంతి ఆత్మహత్య కేసులో ఆమె భర్త కుటుంబీకులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ స్వరూప్ కథనం మేరకు.. శాంతికి 2024లో భీమలింగతో వివాహమైంది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భీమలింగ కుటుంబీకులు కూడా శాంతిని వేధించేవారు. వారి ఒత్తిడిని భరించలేక ఆమె మహిళా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసింది. తర్వాత ఐర్లండ్‌కు వెళ్లిన భీమలింగ తనతోపాటు పాటు శాంతిని తీసుకెళ్లకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. శాంతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భీమలింగ కుటుంబీకులు చాకలి కృష్ణమూర్తి, చిరంజీవి, రామాంజనేయులును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.


