చుక్కలనంటుతున్న బియ్యం
నియంత్రణ చర్యలు శూన్యం
సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్రమైన ప్రభావం
సామాన్యుడికి కష్టకాలం నడుస్తోంది. నెలవారీ బడ్జెట్ మోయలేని భారంగా మారింది. ఇటీవల వరకు ఇంధన ధరలు మోతెక్కిపోయాయి. తర్వాత గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరో వైపు వంట నూనె ధరలు ప్రతి వారం అధికమవుతున్నాయి. ఇంకోవైప్పు పప్పు ధాన్యాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఈ క్రమంలోనే బియ్యం కొనాలంటే వినియోగదారులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. నియంత్రణలో అధికారులు వైఫల్యం చెందడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నేతలు మాత్రం ఎల్‌నినో సాకును చూపించి చేతులెత్తేస్తున్నారు. అలాగే యుద్ధం కారణంగానే వాణిజ్య పన్నులు పెరిగాయని, ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతోందని కంటి తుడుపు కబుర్లు వల్లిస్తున్నారు.
తిరుపతి అర్బన్ : నిన్నటి మొన్నటి వరకు డీజల్, పెట్రోల్ ధరలను వరుసగా పెంచేశారు. అనంతరం గ్యాస్ ఇక్కట్లతో ప్రజలు సతమతమయ్యారు. అలాగే నూనె, పప్పుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. చౌకదుకాణాల్లో కందిపప్పు ఇవ్వడమే మానేశారు. ఇక కూరగాయల ధరలు తెలిసిందే. వాటిని ముట్టుకోవాలంటేనే సామాన్య ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీచాలవంటూ బియ్యం రేట్లను సైతం ఇష్టారాజ్యంగా పెంచడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. అధికారపార్టీకి చెందిన నేతలు మాత్రం ఎల్‌నినో వాతావరణం మార్పులతోనే బియ్యం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా– ఇరాన్ యుద్ధంతోనే రేట్లు పెరిగాయంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం వారి మాటలను నమ్మడం లేదు. ఎన్నికల ముందు ధరలను అదుపులో ఉంచుతామంటూ హామీలు గుప్పించి, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కడంపై మండిపడుతున్నారు.
కొత్త బియ్యమే దిక్కు
సాధారణంగా వినియోగదారులు పాత బియ్యం కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు పాత బియ్యానికి..కొత్త రకానికి కేవలం ఐదు నుంచి పది రూపాయిలు మాత్రమే తేడా ఉండేది. అయితే జిల్లాలో ప్రస్తుతం పాత బియ్యం లేవంటూ వ్యాపారులు చెప్పకొస్తున్నారు. తర్వాత పాత బియ్యం కావాలంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త బియ్యం రేట్లను సైతం ఇష్టారాజ్యంగా పెంచేశారు. దీంతో జిల్లా వాసులు బియ్యం కంటే రాగులు, సజ్జలు కొనుగోలు చేయడం ఉత్తమంగా భావిస్తుండడం గమనార్హం.
తనిఖీలకు దూరం
బియ్యం ధర పెరుగుతున్నప్పటికీ అదుపులోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, సివిల్ సప్లయిస్, విజిలెన్స్ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలకు దూరంగా ఉంటున్నారని వినియోగదారుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠినచర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని డిమాండ్ చేస్తున్నారు.
25 కిలోల బియ్యం బస్తా ధరలు
రకం నెల క్రితం రేటు(రూ.లో) ప్రస్తుతం
బీపీటీ కొత్తవి 1,010 1,510
బీపీటీ పాతవి 1,275 1,625
స్టీమ్డ్ రైస్ 1,320 1,610
సోనామసూరి 1,210 1,540
హెచ్‌ఎంటీ 1,270 1,620
దంపుడు బియ్యం 1,210 1,500
మసర్లు 930 1,230
నూకలు 320 800
దడ పుట్టిస్తున్న ధర
రైతులకు మాత్రం పాత ధరలే..
జిల్లాలో బియ్యం ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలలుగా బహిరంగ మార్కెట్‌లో అన్నిరకాల బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో బియ్యం రేట్లు పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు. అయితే రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో గత రెండేళ్లుగా చూస్తే ఏ గ్రేడ్ వరి రకం క్వింటా రూ.2389కి, బీ గ్రేడ్ వరి రకం క్వింటా రూ.2369 లెక్కన కొనుగోలు చేసింది. ఏటా క్వింటాపై రూ.200 పెంచాల్సి ఉండగా, పాత ధరలే చెల్లించింది. ఈ మేరకు జిల్లాలో 1.70లక్షల క్వింటాళ్లు వరిధాన్యం కొనుగోలు చేసింది. అయితే తిరిగి బియ్యం అమ్మే క్రమంలో మాత్రం ధరలను విపరీతంగా పెంచేస్తున్నప్పటికీ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందింది. 25 కేజీల బియ్యం బస్తా రూ.300 నుంచి రూ.400 పెంచేసినా పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


