గోవు సకల దేవతలకు ప్రతీక అంటారు పెద్దలు. అందుకే హిందూ సంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆపార భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. అలాంటి గోవు కష్టాల్లో ఉందంటే ఎవరైనా చలించిపోతుంటారు. కానీ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఓ కామధేనువు చావుబతుకుల మధ్య ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్నారావ్ సర్కిల్ వద్ద ఓ గోవును గుర్తు తెలియని వాహనం మూడు రోజుల క్రితం ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆవుకు తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. కనీసం లేచి నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. మూడు రోజులుగా అక్కడే తిండీతిప్పలు లేకుండా ఉండిపోయింది. పాదచారులు, వాహనచోదకులు దీన్ని మూడు రోజులుగా చూస్తూ వెళ్లారే తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎండకు.. వానకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి స్థానికులు కొందరు ఆ గోవుపై తార్పారు పట్టలు కప్పి నీళ్లు చల్లి చల్లదనం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆవు ప్రమాద స్థితిలో ఉందని గమనించి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీతో ఆవును తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ దృశ్యాలను బుధవారం సాక్షి క్లిక్ మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, తిరుపతి


