తిరుపతి అర్బన్: ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో తక్కువ ధరకే బియ్యం అందిస్తామని ఈ నెల 3వ తేదీ(సోమవారం) తిరుపతి అన్నమయ్య సర్కిల్ రైతు బజారు వద్ద అధికారులు, పాలకులు హంగామా చేశారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 26 కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజులు గడవకముందే 26 కిలోల బియ్యం కాదు.. ఒక్కో కార్డుకు కేవలం పది కేజీల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తామంటూ అధికారులు మాట మార్చారు. దీంతో కార్డుదారులు అవాక్కయ్యారు.
మొన్న ఏమన్నారంటే?
గత సోమవారం తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని రైతు బజారులో తక్కువ ధరలకే బియ్యాన్ని ఇస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. సమాచారశాఖ ఆధర్యంలో విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో జిల్లాలో 28 కేంద్రాల్లో సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో మార్కెట్‌లో రూ.65 నుంచి రూ.70 వరకు ఉన్న స్టీమ్డ్ బీపీటీ కేజీ బియ్యాన్ని రూ.52కి ఇస్తామని, అలాగే మార్కెట్‌లో రా బీపీటీ బియ్యం కేజీ రూ.58 నుంచి రూ.62 ఉండగా..ఆ బియ్యాన్ని రూ.50కి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో రైస్ కార్డుదారుడికి 26 కేజీల చొప్పున పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పుడేమంటున్నారంటే?
బుధవారం కలెక్టరేట్‌లో రైస్ మిలర్లతో అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత సమాచారశాఖ ద్వారా విడుదల చేసిన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇందులో ఒక్కోకార్డు ఉన్నవారికి 10 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తామని చెప్పారు. అలాగే తిరుపతి అన్నమయ్యసర్కిల్ రైతు బజారు ఒక్కటే కేంద్రంగా పేర్కొన్నారు. మిగిలిన 27 రైస్ మిల్లర్ల వద్దకు వెళితే వారు పది కేజీల చొప్పున బియ్యాన్ని ఇస్తారని అందులో వెల్లడించారు. స్టీమ్డ్ బీపీటీ కేజీ బియ్యాన్ని రూ.52కి, బీపీటీ రా బియ్యాన్ని రూ.50 ఇస్తామని అందులో వివరించారు.
కంది పప్పు కేంద్రాల వలే మార్చేస్తారా!
చౌకదుకాణాల్లో దశాబద్దాలుగా రాయితీతో కందిపప్పును రైస్ కార్డుదారులకు ఇచ్చేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా...చౌకదుకాణాల్లో కందిపప్పు ఊసేలేకుండా పోయింది. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కందిపప్పు కౌంటర్లు పెడుతున్నట్లు హంగామా చేశారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని రైతు బజారులో ఓ కౌంటర్ పెట్టారు. ఆ తర్వాత జిల్లాలోనే కాదు తిరుపతిలోని కౌంటర్ సైతం మాయం కావడంతో పలువురు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. బియ్యం పరిస్థితులు అలానే ఉంటాయనే ఆందోళన చెందుతున్నారు.
పొరబాటున 26 కేజీలు అని చెప్పాం
ఈ నెల 3వ తేదీన అన్నమయ్య సర్కిల్‌లోని రైతు బజారు వద్ద ఒక్కో కార్డుకు 26 కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పాం. అయితే కమిషనర్ కార్యాలయం నుంచి 26 కేజీలు కాదు...10 కేజీలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. రైస్ కార్డుతోపాటు ఆధార్ కార్డును తీసుకురావాలి.
– శేషాచలంరాజు, జిల్లా సివిల్‌సప్లై అధికారి


