అరుదైన తాళపత్రాలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

అరుదైన తాళపత్రాలను సంరక్షించాలి

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

తిరుపతి సిటీ: దేశంలో ప్రచారంలో లేని, వెలుగుచూడని తాళపత్రాలు అనేకం ఉన్నాయని, వాటిని సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వేదిక్‌ వీసీ రాణి సదాశివమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాల సంరక్షణ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ తాళపత్ర గ్రంథాల సంరక్షణలో వేదిక్‌ వర్సిటీ విశేష కృషి చేస్తోందన్నారు. అనంతరం వీసీ రచించిన భారత దేశంలో లిపిశాస్త్రం, తాళపత్ర గ్రంథ శాస్త్ర పరిచయం అనే నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ తిరుపతి రీజనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాఘవన్‌, కన్జర్వేషన్‌ విభాగాధిపతి అచల్‌ పాండ్యా, వేదిక్‌ వర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ పబ్లిషింగ్‌ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాథేశ్యాం, రిజిస్ట్రార్‌ బలభద్ర ఉపాధ్యాయ, డీన్లు పాల్గొన్నారు

అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026 అందజేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 20వ తేదీలోపు ఆయా డీవైఈఓ కార్యాలయాల్లో దరఖాస్తును అందజేయాలని, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ

తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ వైరాలజీ విభాగం, రూసా ఫేజ్‌–2, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ వైరస్‌–లైక్‌ పార్టికల్‌ టెక్నాలజీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో బేసిక్స్‌ ఆఫ్‌ పీసీఆర్‌ అండీ ఎన్‌ఏజెల్‌ ఎలక్ట్రోఫోరెసిస్‌ అనే అంశంపై విద్యార్థులకు రెండు రోజుల పాటు జరిగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం వర్సిటీలో బుధవారం ప్రారంభమైంది. ఆధునిక ప్రయోగశాల సదుపాయాలు, పరికరాలు పరిమితంగా ఉన్న డిగ్రీ కళాశాలలకు చెందిన జీవశాస్త్ర విద్యార్థులకు మాలిక్యులర్‌ బయాలజీ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కాలేజ్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య వీ.పద్మావతి, రూసా ఫేజ్‌ 2 కో–ఆర్డినేటర్‌ ఆచార్య కేవీ.సుచరిత, వైరాలజీ విభాగాధిపతి ఆచార్య జీ.నరసింహ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిశోధనలకు శాశ్వత గుర్తింపు

తిరుపతి సిటీ: విలువలతో కూడిన పరిశోధనలకు శాశ్వత గుర్తింపు ఉంటుందని. అటువంటి పరిశోధనల వైపు అడుగులు పడాలని వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో రీసెర్చ్‌ ఎథిక్స్‌ అండ్‌ ప్లాగరిజం టూల్స్‌ అనే అంశంపై సెనేట్‌ హాల్‌లో మూడు రోజల వర్క్‌ షాపు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి అతిథులు, అధికారులతో కలసి వర్క్‌ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో పాటు మానవీయ మేధస్సును పరిశోధనలో పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. వర్క్‌షాపు నిర్వాహకులు ప్రొఫెసర్‌ కే.సురేంద్రబాబు మాట్లాడుతూ పరిశోధనలకు ఉపయోగపడే 12 రకాల అంశాలపై సమగ్ర సమాచారాన్ని కార్యశాల అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్‌ డాక్టర్‌ కె.మనోజ్‌కుమార్‌, తమిళనాడుకు చెందిన ఆచార్య రవి, శ్రీనివాస రాఘవన్‌, డాక్టర్‌ ఆర్ముగం, పాండిచ్చేరికి చెందిన ఆచార్య సేవుకన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement