నోటిఫికేషన్‌ వచ్చిందోచ్‌! | - | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్‌ వచ్చిందోచ్‌!

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

నాలుగు నెలల నిరీక్షణకు తెర ఈనెల 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తిరుపతి సిటీ: డిగ్రీ ప్రవేశాల కోసం జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ ఫలితాలు ఏప్రిల్‌లో విడుదలైనా నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు స్పందించిన ఉన్నత విద్యామండలి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌నే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా పీజీ సెట్‌, లాసెట్‌, ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. అడ్మిషన్లు ఎప్పుడు జరుగుతయో తెలియని పరిస్థితి.

11 వరకు రిజిస్ట్రేషన్‌కు గడువు

డిగ్రీ ప్రవేశాలకు బుధవారం నుంచి ఈనెల 11వ తేదీలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మోడ్యుల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉన్నత విద్యామండలి 20వ తేదీన వెబ్‌ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 26న మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయనున్నారు. 27 నుంచి 29వ తేదీలోపు ఆయా కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.

126 కళాశాలల్లో అడ్మిషన్లు షురూ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమారు 126 డిగ్రీ కళాశాలల్లో 21 విభాగాలలో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌తో దాదాపు 26,755 సీట్లు భర్తీ చేయనున్నారు.

అటానమస్‌ హోదాలో మూడో ఏడాది ప్రవేశాలు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌, ఓరియంటల్‌ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రాంభం కానుంది.. దీంతో పాటు సికింద్రబాద్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీవీవీఎస్‌ డిగ్రీ కళాశాలలో సైతం అడ్మిషన్లుకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్‌జీఎస్‌ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరంలో తొలి ఏడాది అటానమస్‌ హోదాలో అడ్మిషన్లు జరగగా మూడో ఏడాది 2026–27 విద్యాసంవత్సరానికి ప్రస్తుతం అడ్మిషన్లు జరగనున్నాయి. టీటీడీ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉచిత భోజన, వసతి కల్పించనున్నారు.

ఎట్టకేలకు విడుదలైన డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌

జిల్లాలోని డిగ్రీ కళాశాలల సమాచారం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 17

ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104

టీటీడీ డిగ్రీ కళాశాలు 5

విభాగాలు 21

అందుబాటులో ఉన్న

మొత్తం సీట్ల సంఖ్య 26,755

హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆప్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్లను ప్రత్యేక హెల్ప్‌లైన్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్‌లైన్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

టీటీడీ పరిధిలోని డిగ్రీ కళాశాలల వివరాలు

కళాశాల కళాశాల కోడ్‌ విభాగాలు మొత్తం సీట్లు

పద్మావతి డిగ్రీ కళాశాల 18195 21 1,550

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల 20132 20 1,417

ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల 17656 19 1,068

ఎస్వీ ఓరియెంటల్‌ కళాశాల 20185 6 300

సికింద్రాబాద్‌ ఎస్వీవీవీఎస్‌ 25519 3 60

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement