శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏఐ అనుసంధానంపై ప్రైవేటు సంస్థ బృందం పర్యటన హుండీ కౌంటింగ్ పరిశీలన వివరాల గోప్యతపై అనేక అనుమానాలు!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో అకౌంటబిలిటీని మెరుగుపరిచే ఉద్దేశంతో ఏఐ (ఆ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను వినియోగించే అవకాశాలపై ఒక ప్రైవేటు సంస్థ బృందం ఇటీవల ఆలయంలో పర్యటించినట్లు తెలిసింది. బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించి వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఆ బృందం ఏ అంశాలపై అధ్యయనం చేసింది, ఏ వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది, ఏ వివరాలు సేకరించింది అనే విషయాలను ఆలయ అధికారులు వెల్లడించడం లేదు. కొత్త ప్రణాళికలు చేపట్టినప్పుడు వాటి వివరాలను మీడియాకు తెలియజేసే ఆనవాయితీ ఉన్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం పూర్తి సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఆ బృందంలోని కొందరికి హుండీ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే హుండీ కౌంటింగ్‌లో ఏ అంశాలను పరిశీలించారు, వాటిని ఏఐతో ఎలా అనుసంధానం చేయాలనుకుంటున్నారు అనే విషయాలపై స్పష్టత లేదు. ఈ విషయమై ఆలయ ఈవో వెంకటేశ్వర్లును వివరణ కోరగా, ఆలయంలో అకౌంటబిలిటీని మరింత మెరుగుపరచే ఉద్దేశంతోనే ఏఐ సాంకేతికతను వినియోగించే అవకాశాలను పరిశీలించేందుకు ఆ ప్రైవేటు సంస్థ బృందాన్ని తామే ఆహ్వానించామని తెలిపారు. అయితే వారు ఏ అంశాలపై అధ్యయనం చేశారనే వివరాలను వెల్లడించ లేదు. ఈ బృందం పర్యటన తమకు సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ పరిణామంపై స్థానికంగా చర్చ సాగుతోంది.


