● యువకుడిని తీసుకెళ్లే యత్నం? ● తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ● జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు
తిరుపతి క్రైం : తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ వద్ద పోలీసులమంటూ వచ్చిన కొందరు వ్యక్తులు ఉద్యోగిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారంటూ అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు.. గాజులమండ్యం వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కంపెనీ వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి, ‘రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడు? అతడిని తీసుకెళ్లాలి’ అంటూ అక్కడ ఉన్న మల్లికార్జున్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై అతను ‘మీరు నిజంగా పోలీసులైతే యూనిఫాం ఎక్కడ?’ అని ప్రశ్నించగా, రామచంద్రారెడ్డి లేకపోతే ‘నువ్వే రా’ అంటూ తనను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం వాహనం అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఒక వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, తమపై కేసులు పెడితే బయట తిరగనివ్వమని, కంపెనీ నిర్మాణం కూడా కొనసాగనివ్వమని బెదిరించారు. ఈ ఘటనపై మల్లికార్జున్‌రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసే ప్రక్రియతో పాటు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
రెవెన్యూ సమస్యలపై దృష్టి
తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆదేశించారు. మంగళవారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వీడియా కాన్ఫరెన్స్ అనంతరం జేసీ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ప్రధానంగా 22ఏ, భూపరిపాలన అంశాలు, రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పారెస్ట్ ల్యాండ్ సమస్యలు తదితర వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. ఒక్కొక్కటిగా రెవెన్యూకి చెందిన సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరి పరిధిలోని అంశాలను వారు బాధ్యతగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని వివరించారు. తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే అధికారి రాంప్రసాద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
వ్యభిచార గృహంపై
పోలీసుల దాడి
తిరుపతి క్రైం : తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించి, నిర్వాహకురాలితో పాటు ముగ్గురు విటులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను రెస్క్యూ హోంకు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. పోలీసుల కథనం.. అక్కారంపల్లి సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో అలిపిరి పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతోపాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే రూ.1,500 నగదు, 10 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ తెలిపారు.
రాజన్న ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు
రేణిగుంట: రేణిగుంట మండలంలోని రాజన్న ఫౌండేషన్ జాతీయ అవార్డు అందుకుంది. సీఎస్‌ఆర్ టైమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం న్యూఢిల్లీలో 13వ జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ, సామాజిక, సుపరిపాలన సదస్సు, అవార్డులు–2026 బహుకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు అందుకున్నట్టు రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి తెలిపారు.
మద్యం మత్తులో కత్తితో దాడి
తడ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండలంలోని వెండ్లూరుపాడులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొండపనాయుడు కథనం.. మండలంలోని వెండ్లూరుపాడు గ్రామానికి చెందిన పాలా నవీన్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన బూరగ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. నవీన్‌కు తీవ్ర గాయమైంది. నవీన్‌ను మొదట సూళ్లూరుపేటకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చైన్నెకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


