నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు
382 స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో అన్నీ అవకతవకలే
తిరుపతి మంగళం : డీఎస్సీ నియామకాలలో అన్నీ అవినీతి అక్రమాలేనని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం డీఎస్సీలో అవినీతి అక్రమాలపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎస్సీలో కేటాయించిన 382 స్పోర్ట్స్ కోటా పోస్టులలో అన్నీ అవకతవకలేనన్నారు. అనర్హులకు ఉద్యోగాలు కల్పించిన మంత్రి లోకేష్, శ్యాప్ చైర్మన్ రవినాయుడు బండారాన్ని బట్టబయలు చేశారు.
రుజువులు కావాలా రాజా!
కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా కింద నచ్చిన వాళ్లకు, తమకు కావాల్సిన వాళ్లకు, రూ.లక్షలు ముడుపులు ఇచ్చిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టేశారని అభినయ్ ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..!
382 పోస్టులలో 46 పోస్టులు పీఈటీలుగా నియమితులయ్యారు. మిగిలిన 336 మందిని సోషల్, ఇంగ్లిష్, తెలుగు, సైన్స్ టీచర్లుగా నియమించారు. వీరందరికీ ఎక్కడా రిటర్న్ ఎగ్జామ్ పెట్టలేదు. వీళ్ల వద్ద రూ.20 లక్షలు, రూ.30 లక్షలు తీసుకుని ఉద్యోగాలిచ్చేశారు. ఈ స్పోర్ట్స్ కోటాలో జ్యూడోకు సంబంధించి నియమితులైన 30 మంది అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే సుధారాణి, చంద్రనాయక్, విజయాజుల్లా నల్బందీ, డకోజీ పాండు వీళ్లంతా 2013 అక్టోబర్ 19 నుంచి 21వరకు ఖమ్మం జిల్లాలో జ్యూడో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లుగా సర్టిఫికెట్లు జారీచేశారు. కానీ అవన్నీ ఫేక్. అలాగే 2019 డిసెంబర్ 1న విజయవాడలో ఇంటర్ జ్యూడో స్పోర్ట్స్‌లో క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు చెందిన రెండు సర్టిఫికెట్లను పొందుపరిచారు. వీరిద్దరికీ అదే స్పోర్ట్స్‌లో రెండవ స్థానం వచ్చిందని పేర్కొనడం విడ్డూరం. అలాగే తిరుపతికి చెందిన ఇ.గోపి గత నాలుగేళ్లుగా శాప్‌లో పనిచేస్తున్నాడు. ఫస్ట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ మెన్ జ్యూడో చాంపియన్ షిప్ విజయవాడలో 2014 నవంబర్ 28, 29 తేదీలలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి చాంపియన్ షిప్. అందులో సర్టిఫికెట్ జారీ అయ్యింది. అయితే డీఎస్సీలో ఉద్యోగాలు తెచ్చుకున్న ఐదుగురు అభ్యర్థులు కొన్ని సర్టిఫికెట్లు పెట్టారు. 2014 నవంబర్ 11, 13 తేదీలలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్ షిప్ జరిగినట్లుగా వాళ్లు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అదే నెలలో పదిహేను రోజులకు ముందు ఇంకో చాంపియన్‌షిప్ జరిగినట్లుగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు. 2014 నవంబర్ 11, 13 తేదీల్లో చాంపియన్ షిప్‌లో పాల్గొన్నట్లుగా సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది. 2022లో రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మహిళలు సులోచన, నిఖితకు రెండవ స్థానానికి సంబంధించి సర్టిపికెట్లు జారీఅయ్యాయి. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. 2022లో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జ్యూడో చాంపియన్ షిప్ రిజల్డ్ షీటు చూస్తే సులోచన 48 కేజీల కేటగిరి కంటే తక్కువ ఉన్న వాటిలో రెండవ స్థానం వచ్చింది. కానీ ఇక్కడెక్కడా 48 కేజీల కేటగిరి లిస్ట్‌లో సులోచన పేరు లేదు. అలాగే 70 కేజీల కేటగిరికి సంబంధించిన జాబితాలో కసాయి నిఖిత పేరు ఎక్కడా లేదు. 48 కేజీల కేటగిరిలో నాగప్రియాంక రెండవ స్థానంలో ఉంది. 70 కేజీల కేటగిరిలో శేషారాణి పేరు ఉంది. అంటే చాంపియన్‌షిప్ లిస్ట్‌లో ఉన్న పేర్లుకు, సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు ఎలాంటి సంబందమే లేదు. ఆ ఇద్దరు అమ్మాయిలకు నకిలీ సర్టిఫిక్లెతో ఉద్యోగాలు ఇచ్చారు. జ్యూడో అసోసియేషన్‌లో ఎప్పుడు ఈవెంట్స్ చేసినా వాటిని చాంపియన్‌షిప్ అంటారు. అయితే 20 మందికి జారీ చేసిన సర్టిఫికెట్లలో టోర్నమెంట్ అని ప్రింట్ చేశారు. దీనిపైన జ్యూడో అసోసియేషన్, శ్యాప్ సమాధానం చెప్పాలి. ఇలా 39 సర్టిఫికెట్లను పరిశీలిస్తే 30 సర్టిఫికెట్లు నకిలీవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో శ్యాప్ చైర్మన్ రవినాయుడు హస్తం లేదంటే పొరబాటే. డీఎస్సీలో అవినీతి అక్రమాలకు ముఖ్య సూత్రదారుడు మంత్రి లోకేష్. మిగిలిన వాటికి వస్తే... ఎస్‌ఈఆర్‌డీ అనేటువంటి దానిలో డీఎస్సీ పేపర్‌ను సెట్ చేస్తారు. ఆ పేపర్‌ను సెట్ చేసే దానిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే రవీంద్రనాయుడు అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఇంకెంతమందికి ఆ పేపర్‌ను లీక్ చేశారో తెలియని పరిస్థితి.’ అని చెప్పారు. అవినీతి డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యమపోరాటాలు చేస్తోంది..’ అని అభినయ్ అన్నారు.
ఆధారాలతో సహా బయట పెట్టిన భూమన అభినయ్


