భూ ఆక్రమణలపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణలపై ఆగ్రహం

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

రేణిగుంట : తెలంగాణకు చెందిన విద్యా సంస్థల అధినేత తమ గ్రామంలోని ప్రైవేటు కాలేజీని కొనుగోలు చేశారని, అప్పటి నుంచి పక్కనున్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని డి.మల్లవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రేణిగుంట మండలం, కృష్ణాపురం పంచాయతీ దిగువ మల్లవరంలో గ్రామస్తుడు రవి మాట్లాడుతూ శ్మశానానికి వెళ్లేందుకు 12 అడుగుల వెడల్పుతో దారి ఉందన్నారు. కాలేజీ వాళ్లు ఆ దారిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే గ్రామం నుంచి వెలుపలకు వెళ్లే దారిని సైతం వారు ఆక్రమించేందుకు చర్యలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి జేసీబీతో ఆయా ప్రాంతాలను చదును చేయిస్తున్నారని వెల్లడించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

తిరుపతి రూరల్‌ : భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఎన్‌జీవో కాలనీలోని అమర్‌ జవాన్‌ పార్క్‌ వరకు భారీ మార్చ్‌పాస్ట్‌ చేపట్టారు. ఇందులో వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు చెందిన 200 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, కార్గిల్‌ యుద్ధ వీరుడు, పాఠశాల చైర్మన్‌ బి.శేషారెడ్డి, పాఠశాల డీన్‌, రిటైర్డ్‌ ఎయిర్‌ కమెండోర్‌ సి.జి.హెచ్‌.ఖాన్‌ హాజరయ్యారు. ఇటీవల చైన్నె కమాండెంట్‌ ఎం.ఇ.జి సెంటర్‌ (మద్రాస్‌ సప్పర్స్‌) నుంచి వెటరన్‌ అచీవర్స్‌ అవార్డు పొందిన బీవీ శేషారెడ్డిని ఘనంగా సత్కరించారు.

టీటీడీ కళాశాలలకు ఇంటర్‌ పుస్తకాలు

తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్‌ కళాశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్‌, నోట్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా కళాశాలలకు టెక్ట్స్‌ పుస్తకాలు చేరాయి. ఈ వారంలోనే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు స్పందించిన టీటీడీ అధికారులు ఎస్వీ, పద్మావతి, డెఫ్‌ అండ్‌ డమ్‌ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీకి సన్నాహాలు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి మార్గంలోని పల్లం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలుకు చెందిన శంకర్‌రెడ్డి(65), బాలయ్య(52) పల్లంపేట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా, వెంకటగిరి వైపు నుంచి వస్తున్న ఓ కారు ఢీకొంది. దీంతో శంకర్‌రెడ్డి, బాలయ్య తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా శ్రీకాళహస్తి వైపు వెళుతుండగా సమాచారం అందుకున్న ముచ్చువోలువాసులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి కారును ఆపి డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

మలుపు వద్ద ప్రభుత్వ స్థలం కబ్జా

ఏర్పేడు: మండలంలోని పల్లం గ్రామం వద్దమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఏర్పేడు–వెంకటగిరి, శ్రీకాళహస్తికి ఈ మార్గం గుండా నిత్యం వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే మలుపు వద్ద రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం 40 సెంట్లను స్థానిక టీడీపీ నేత దర్జాగా కబ్జా చేసి షెడ్డును నిర్మించారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే కబ్జా చేసిన వారికి నోటీసులిచ్చారు. అదే మార్గంలో తాగునీటి పైపులైనును ఆక్రమణదారుడు పూడ్చివేశాడు. దీంతో 15 రోజులుగా గ్రామానికి తాగునీరు అందడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement