ముగిసిన వైదిక మహా యజ్ఞం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వైదిక మహా యజ్ఞం

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

చంద్రగిరి: లోక కల్యాణార్థం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన వైదిక మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. శ్రీరాముడి కోసం పుత్రకామేష్టి యాగం నిర్వహించిన శ్రీశృంగి మహర్షి వంశీకుడు, స్వరవేద మహా మందిర ధామం నిర్వాహుకుడు సద్గురు ఆచార్య స్వంత్రం దేవ్‌ జీ మహారాజ్‌ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా మంత్రరాజ పీఠం ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు సింహయాజీ స్వామీజీ, శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు పాల్గొన్నారు. అతిథులకు నిర్వాహకులు కుమార్‌ నాయుడు దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వతంత్ర మహదేవ్‌ జీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ క్రమంలోనే శివశ్రీ స్కందప్రసాద్‌ అయ్యంగార్‌, గజల్‌ శ్రీనివాస్‌ భక్తి పాటలతో అలరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌యూ వీసీ కృష్ణమూర్తి, స్విమ్స్‌ డైరెక్టర్‌ రామ్‌ పాల్గొన్నారు.

పొదల్లోకి దూసుకెళ్లిన కారు

చంద్రగిరి : అతివేగం కారణంగా చెట్ల పొదల్లోకి కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం కల్యాణి డ్యామ్‌ సమీపంలో జరిగింది. వివరాలు.. తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న కారు డ్యామ్‌ సమీపంలోని పెద్ద మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకుపోయింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, ఇద్దరు గాయపడ్డారు. వివరాలు తెలియాల్సి ఉంది.

చికిత్సపొందుతూ మహిళ మృతి

సూళ్లూరుపేట : మండలంలోని కోటపోలూరు గ్రామానికి చెందిన మెల్లకంటి సుజాత (44) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాలు.. ఈ నెల 3వ తేదీ వేకువజామున మృతురాలి ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ నుంచి పెట్రోల్‌ లీక్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సుజాత కేకలు వేస్తూ మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా పెట్రోల్‌ ట్యాంక్‌ కిందపడి మంటలు ఆమెను చుట్టుముట్టాయి. తీవ్రంగా గాయపడిన సుజాతను చైన్నెలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సుమారు 23 రోజులుగా చికిత్స పొందుతూ సుజాత మరణించింది. అదివారం ఈ మేరకు సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, చైన్నెలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement