ఎంపీ గురుమూర్తికి రాజా కృతజ్ఞతలు
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఆధునిక సమాచార సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చిన తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తికి వెంకటగిరి రాజా వారసులు వీవీఎస్ సర్వజ్ఞకుమారకృష్ణయాచేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన వెంకటగిరిలో విలేకరులతో మాట్లాడారు. వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో చాలకాలంగా పనిచేయకుండా ఉన్న ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్, స్క్రోలింగ్ డిస్‌ప్లే బోర్డుల సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే అధికారుల దృష్టికి ఎంపీ తీసుకెళ్లి పరిష్కరించినట్టు వెల్లడించారు. గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్‌గుప్తా వెంటనే సమస్యపై స్పందించారని ఆయన వెల్లడించారు.
ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులే లక్ష్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా వంద శాతం ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు దిశగా వినియోగదారులను సమాయత్తం చేస్తున్నట్టు సీఎండీ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ యుగానికి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత సరళతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు.
49.50శాతం ఆన్‌లైన్ చెల్లింపులు
ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, డైనమిక్ క్యూఆర్‌కోడ్, వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర), నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా విద్యుత్ బిల్లులను సులభంగా మొబైల్ నుంచి చెల్లించవచ్చన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 61.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా రూ.520 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం బిల్లుల్లో 49.50 శాతం ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.
13 లోపు దరఖాస్తు చేసుకోండి
తిరుపతి సిటీ: జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో పలు కోర్సులలో లేటరల్ ఎంట్రీ విధా నం ద్వారా నేరుగా డిప్లొమో సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 13వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ స్పాట్ అడ్మిషన్లకు అర్హు లని తెలిపారు. ఈనెల 16న ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు.


