ఉన్నతాధికారి ఆదేశించారు.. తిరుచానూరు పోలీసులు ఆచరించారు మాజీ సర్పంచ్ వర్గీయులపై నాన్‌బెయిలబుల్ కేసులు ఇద్దరి మధ్యన జరిగిన గొడవలో ఏకపక్షంగా ఎఫ్‌ఐఆర్ నమోదు పోలీస్ స్టేషన్‌లో అక్రమ నిర్బంధం టూరిస్టు బస్టాండు వేలంలో పాల్గొనకుండా చేసేందుకు కుట్ర స్థానిక ముఖ్యనేత కనుసన్నల్లో పోలీసుల పాత్రే కీలకం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అమ్మవారి సన్నిధిలో.. పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ ఆదేశించారు.. తిరుచానూరు పోలీసులు ఆచరించారు. నడి రోడ్డుపై ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చిన్నపాటి గొడవకు రాజకీయ రంగు పులిమి వైఎస్‌ఆర్ సీపీకి చెందిన మాజీ సర్పంచ్ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి బలవంతంగా అరెస్టు చేశారు.
వేలంపాట కోసమే ఇదంతా..
తిరుచానూరు పంచాయతీకి చెందిన ప్రైవేటు టూరిస్టు బస్టాండుకు పంచాయతీ అధికారులు సోమవారం వేలం పాటను నిర్వహించనున్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ తిరుచానూరు తాజా మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డితో పాటు అతని సోదరుడు ఎంపీటీసీ నరేష్‌రెడ్డికి ముందుగానే టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. అయితే అందుకు వారు అంగీకరించకపోవడం, శనివారం రాత్రి అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు మధ్యన జరిగిన చిన్నపాటి గొడవలో వీరందరినీ ఇరికించే పనులను చకచకా పూర్తి చేసేశారు. అక్రమంగా కేసులు పెట్టడమే కాక వారిని పోలీస్ స్టేషన్‌లో నిర్భందించి విచక్షణా రహితంగా కొట్టడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే తిరుచానూరు పోలీసులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గత ఏడాది కూడా ఇదే తంతు
గత ఏడాది మార్చి 24వ తేదీన పంచాయతీ టూరిస్టు బస్టాండు వేలం ప్రక్రియ జరిగింది. అప్పుడు కూడా పోలీసులు, టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇలాగే ప్రత్యర్థులను లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుచానూరు పంచాయతీతో సంబంధం లేని టీడీపీ నేతలంతా అక్కడకు చేరుకుని అప్పటి సర్పంచ్ రామచంద్రారెడ్డి వర్గీయులు ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా టెండరు ఫారాలను చించివేసి నానా హంగామా చేస్తున్నా పోలీసులు చూస్తుండి పోయారు. అప్పుడు సర్పంచ్‌గా పదవిలో వున్న రామచంద్రారెడ్డి తన వర్గీయులను వేలం ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. దీంతో అంతకుముందు కంటే రూ.61.94 లక్షలు అధికంగా పాడి పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్న వారందరినీ అక్రమ కేసులో ఇరికించి తమ ఆధీనంలోకి తీసుకోవడం అమానుషం.
ఆయన ఆదేశించారు.. వీరు ఆచరించారు
తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న అక్రమ అరెస్టులు జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకే జరిగినట్టు సమాచారం. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం తిరుచానూరు పోలీసులు ఆచరించారని, ఇదంతా స్థానిక ముఖ్యనేత సూచనల మేరకు అమలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ టూరిస్ట్ బస్టాండు పార్కింగ్‌కు జరిగే వేలంలో పోటీ రాకుండా చేయడానికే వారిని అరెస్టు చేశారని, అలా చేయడంతో తక్కువ ధరకు టెండరు దక్కించుకునే వ్యక్తి జిల్లా పోలీసు ఉన్నతాధికారితోపాటు స్థానిక ముఖ్యనేతకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టచెబుతారన్న విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే పంచాయతీ పార్కింగ్ టెండరు ప్రక్రియలో పాల్గొనే వారిని టార్గెట్‌గా చేసుకుని అక్రమ కేసులు పెట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పోలీసుల చట్ట వ్యతిరేకతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తిరుచానూరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ చట్టవ్యతిరేకంగా లాఠీలతో కొట్టడంపై జాతీయ మావన హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబీకులు స్పష్టం చేశారు.
వేలంపాట జరిగేనా?
గత ఏడాది జరిగిన వేలం ప్రక్రియలో పోలీసులు, టీడీపీ నేతలు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎలాగోలా లోపలకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా టెండరు ధరలను పెంచేశారు. ఆ సమయంలో కూటమి పార్టీలలో ఒకటైన జనసేనకు చెందిన వ్యక్తి రూ.3.51 కోట్లకు వేలం దక్కించుకున్నాడు. జీఎస్‌టీ, ఇతరత్రా పన్నులతో కలిపి రూ.4.24 కోట్లు చెల్లించేలా టెండరు ఖరారు చేశారు. అలా జరగకుండా ఉండడానికి టెండరు ప్రక్రియకు ముందురోజున ప్రధాన పోటీదారులు అందరినీ బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో వేలం ప్రక్రియలో పోటీ జరుగుతుందా, గత ఏడాది పంచాయతీకి చెల్లించిన రూ.4.24 కోట్లు కంటే అదనంగా వేలం పాట నిర్వహిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


