పెరిగిన ఉష్ణోగ్రతలు
డీహైడ్రేషన్‌కు గురవుతున్న ప్రజలు
ఆస్పత్రుల్లో లేని ముందస్తు ఏర్పాట్లు
తూతూమంత్రంగా ఓఆర్‌ఎస్ కార్నర్లు
కనీసం మాత్రం అవగాహన కల్పించని వైద్యాధికారులు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న రోగులు
సూళ్లూరుపేట : నియోజకవర్గంలోని తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలిలో మొత్తం 13 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 62 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ఓఆర్‌ఎస్ కార్నర్లను నామ్‌కే వాస్తే ఏర్పాటు చేశారు. పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసేవారే లేకుండాపోయారు.
తిరుపతి తుడా : వేసవి నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన వారిలో అధికులు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అలాగే ప్రజా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులు సైతం ఎండ బారిన పడుతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లి పోతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే లోపు వడదెబ్బకు గురవుతున్నారు. అధిక ఎండలు, ఉక్క పోత కారణంగా కొత్త అనారోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో రోగుల ఇక్కట్లును గుర్తించిన ప్రభుత్వం ప్రతి పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓఆర్‌ఎస్ కార్నర్లను ఆర్భాటంగా ప్రారంభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది ఫోటో సెషన్స్ కే పరిమితమైంది. ఆస్పత్రుల్లో రోగులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను తూతూ మంత్రంగా అందిస్తున్నారు. ఎంత నిరసించిన రోగులకై నా ఓఆర్‌ఎస్ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. నిత్యం లక్షలాది మంది యాత్రికులు రాకపోకలు సాగించే తిరుపతి నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ ఓఆర్‌ఎస్ కార్నర్లు నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. అడిగితే తప్ప రోగులకు అందించేవారు కరువయ్యారు.
సిబ్బంది నిర్లక్ష్యం
ఏర్పేడు : శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆస్పత్రితోపాటు, ఎంపేడు, ఏర్పేడు, పాపానాయుడుపేట, తొట్టంబేడు, కాసరం, రేణిగుంటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్‌సీలో సగటున రోజుకు 100 నుంచి 150మంది రోగులు నిత్యం వైద్య సేవలు పొందుతున్నారు. వేసవితాపం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే నామమాత్రంగానే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. రేణిగుంట పీహెచ్‌సీలో కౌంటర్ ఊసే లేదు. మందులతోపాటు అవసరమైన వారికి మాత్రమే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. మిగిలిన చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినా, వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో సక్రమంగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు.
లేని అవగాహన
సాధారణంగా వేసవి ఆరంభం నుంచే అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేవారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేవారు. ప్రధానంగా డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు వెంటనే ఓఆర్‌ఎస్ సేవించాలని సూచించేవారు. అయితే ప్రస్తుతం అలాంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు. కేవలం ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. మొదటి రోజు మాత్రం కొందరు రోగులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించి ఫొటోలు తీసుకుని మమ అనిపించేశారు. తర్వాత ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిన పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారికి సైతం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం లేదు. డీహైడ్రేషన్ సమయంలో ఓఆర్‌ఎస్ సేవించాలని అవగాహన కల్పించడంలో సైతం నిర్లక్ష్యం వహించారు. పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉన్నప్పటికీ రోగులకు మాత్రం సక్రమంగా అందకపోవడం గమనార్హం.
భగభగమంటున్న ఎండలు
మొక్కుబడిగానే..
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్ కార్నర్లను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రోగులకు కనీస మాత్రం అవగాహన కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పలుచోట్లు ఓఆర్‌ఎస్ పాయింట్లు నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలోనే నారాయణవనం పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేవు. అలాగే చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓఆర్‌ఎస్ కార్నర్ పాయింట్‌ను ఏర్పాటు కాలేదు.


