మాట వింటేనే అందలం! | - | Sakshi
Sakshi News home page

మాట వింటేనే అందలం!

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

చెప్పింది చేస్తేనే తహసీల్దారు పోస్టు

లేకుంటే బదిలీ వేటు

అవినీతి మరకలంటిన డీటీలకు

అదనపు బాధ్యతలతో ప్రాధాన్యం

ప్రజాసేవ ప్రామాణికం కాదు.. నిజాయితీ ప్రాతిపదిక కాదు.. విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం లేదు.. సమస్యల పరిష్కారంలో సమర్థతను ఖాతరు చేయడం లేదు. తమ మాట వింటే చాలు.. చెప్పిన పని చేస్తే చాలు.. కోరిన చోట పోస్టింగ్‌ ఇప్పించేస్తారు. అర్హత లేకపోయినా అదనపు బాధ్యతలు అప్పగించేస్తారు. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నా డిప్యుటేషన్‌ కింద కాసులు మూటగట్టుకునే అవకాశం కల్పించేస్తారు. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధుల వ్యవహారం. పరిపాలనలో కీలకమైన రెవెన్యూశాఖను తమ జేబులో పెట్టేసుకుంటున్నారు. ప్రధానంగా తహసీల్దార్ల నియామకాల్లో చక్రం తిప్పుతున్నారు. అనుకూలంగా లేని గ్రూప్‌–2 అధికారులను ప్రాధాన్యత లేని చోటుకు బదిలీ చేయించేస్తున్నారు. అడుగులకు మడుగులొత్తే వారిని అందలం ఎక్కిస్తున్నారు.

అంతులేని అక్రమాలు

తిరుపతి జిల్లాలో విలువైన ప్రభుత్వ, పోరంబోకు, మఠం భూములు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు అధికారుల సహకారంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం, తిరుపతి అర్బన్‌, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, నాయుడుపేట, వెంకటగిరి, బాలాయపల్లె మండలాల పరిధిలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు రికార్డులను తారుమారు చేసి నిజమైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా అనేక మంది బాధితులు కలెక్టరేట్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కి వచ్చే ఫిర్యాదు దారుల్లో ఎక్కువ మంది భూ సమస్యల పరిష్కారం కోసం తిరిగేవారు ఉండడమే ఇందుకు నిదర్శనం.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన రెవెన్యూని అధికార పార్టీ నేతలు తమ జేబు శాఖగా మార్చేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు చెప్పింది చేసేవారు, చెప్పింది వినేవారిని మాత్రమే కీలకమైన తహసీల్దార్లుగా నియమించుకుంటున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎక్కువ మండలాల్లో గ్రూప్‌– 2 కేడర్‌ అధికారులు కాకుండా డీటీలు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు తహసీల్దార్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా, జిల్లాలో తహసీల్దార్ల నియామకాల్లో ఎక్కువ మంది డీటీలకే బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లాలో శనివారం 13 మండలాలకు తహశీల్దార్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఆ 13 మందిలో గ్రూప్‌ 2 అర్హత ఉన్న వారిని స్థానిక ప్రజా ప్రతినిధుల తమ మాట వినడం లేదని కలెక్టరేట్‌కి బదిలీ చేయించారు. 13 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే గ్రూప్‌–2 కేడర్‌ అధికారులు. మిగిలిన వారంతా డీటీ, సీఎస్‌డీటీ, కారుణ్య నియమకాల ద్వారా వచ్చిన వారే ఉన్నారు. వారందరిని ఎఫ్‌ఏసీగా నియమించారు. ఇలా జిల్లాలో 36 మండలాల ఉంటే.. ఏడు మండలాల్లో మాత్రమే గ్రూప్‌ 2 అధికారులు తహసీల్దార్లుగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారంతా డీటీ, సీనియర్‌ అసిస్టెంట్లను తహసీల్దార్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు నియమించుకున్నట్లు రెవెన్యూలో ప్రచారం జరుగుతోంది. ఇక పోతే కలెక్టరేట్‌లో ఏ నుంచి హెచ్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న తహసీల్దార్లలో గ్రూప్‌ 2 వారు 10 మంది ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. 28 మండలాలు ఉన్నాయి. ఈ 28 మండలాల్లో గ్రూప్‌ 2 వారు 10 మంది ఉన్నారు. ఇందులో ఒకరు కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మిగిలిన మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు హెచ్‌డీటీలు, 11 మంది ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

రెవెన్యూశాఖపై

ఎమ్మెల్యేల పెత్తనం

నిబంధనలు పాటిస్తే నచ్చదు

గ్రూప్‌ 2 ఆఫీసర్లు నిబంధనల మేరకు నడుచుకుంటారు. ఒకటీ అరా అతిక్రమించినా.. భవిష్యత్తులో ఎవ్వరికీ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది అక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారిని కొందరు ప్రజా ప్రతినిధులు పక్కన ఉంచుకోరనే ప్రచారం జరుగుతోంది. అక్రమ లే అవుట్లు, కాలువ, చెరువు పోరంబోకు భూములను రెగ్యులరైజ్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీటీ, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు డిప్యుటేషన్‌పై తహసీల్దార్లు (ఎఫ్‌ఏసీ) అయిన కొందరు నిబంధనలన్నీ పక్కన పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకం ద్వారా తహసీల్దార్‌ అయిన ఒకరు, డీటీగా పనిచేస్తూ తహసీల్దార్‌ బాధ్యతలు నిర్వహించిన మరొకరు జిల్లాలో అనేక కాలువ, చెరువు, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. మరి కొందరు ఏసీబీ అధికారులకు పట్టుబడి మళ్లీ అడ్డదారిలో పోస్టింగ్‌ తెచ్చుకున్న వారు లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా.. ప్రజా ప్రతినిధి చెప్పింది కళ్లుమూసుకుని గుడ్డిగా పనిచేసిన కొందరు తహసీల్దార్ల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement