తిరుపతి అర్బన్: శ్రీకాళహస్తిలోని జేఎన్‌టీయూ–స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 15వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు పలు బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ తదితర చదువులు చదువుకున్న వారు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అభ్యర్థుల విద్యార్హత ఉద్యోగ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి
6 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,534 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,560 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
టీటీడీకి
రూ.20 లక్షల విరాళం
తిరుమల: శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన సిద్ధిసాయి రైస్‌మిల్ యజమాని కె.వెంకటేష్ శనివారం టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు సమర్పించారు. ఈ క్రమంలోనే దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు.
‘ఆటిజం’పై అవగాహన
తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా వర్సిటీలో శనివారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఆశ్రిత చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు కవిత, భారతి, దుర్గ జ్యోతి మాట్లాడుతూ ఆటిజం అనేది చిన్నతనంలో కనిపించే నరాల అభివృద్ధి సమస్యగా తెలిపారు. ఆటిజం గల పిల్లల్లో సామాజిక పరస్పర చర్యల లోపం, కమ్యూనికేషన్ సమస్యలు, ప్రవర్తనా మార్పులు ఉంటాయని వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ బేబీ ప్రసూన, రాష్ట్రీయ సేవా సమితి ప్రిన్సిపల్ నందిని మాట్లాడుతూ ఆటిజం గల పిల్లలకు ప్రభుత్వం చేయూతనందించాలని కోరారు.


