తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లోని ఏ బ్లాక్‌లో ఉన్న సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి.. అదే విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ఉద్యోగి వేధింపులు భరించలేక. నేరుగా ఆ అధికారి ఇంటి వద్దకే వెళ్లి తమ జోలికి రావద్దని మరోసారి వేధిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆ అధికారి తీరులో ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపుల స్థాయిని పెంచడం మొదలుపెట్టినట్లు చర్చసాగుతోంది. దీంతో ఇటీవల కలెక్టరేట్‌కు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని ఆ ఉద్యోగి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే తోటి మహిళా ఉద్యోగులు ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే...వెంటనే చర్యలు ఉంటాయని, దాంతో ఆ అధికారి ఉద్యోగం పోతుందని ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుందనే ఓ మానవత్వ ఆలోచన... ఆ మహిళా ఉద్యోగికి నచ్చచెప్పారని తెలిసింది. అయినా ఆ అధికారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఆ మహిళా ఉద్యోగి ఆ అధికారి కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న మరో అధికారికి శుక్రవారం ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ఉన్నతాధికారి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు మహిళా ఉద్యోగితోపాటు తోటి ఉద్యోగులను, అటు ఆ అధికారిని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో వేధింపులకు గురైన మహిళా ఉద్యోగి వద్ద అధికారి పెట్టిన మెసెజ్‌లు, ఫొటోలు, వీడియోలు విచారణ సందర్భంగా చూపినట్లు తెలిసింది. తాను ఏ విధంగా వేధింపులకు గురికావడం జరిగిందన్న విషయం పూర్తిగా వివరించారని, అలాగే విచారణ సందర్భంగా ఆ అధికారి మాత్రం తమకు ఏ పాపం తెలియదని బుకాయిస్తున్నట్లు చర్చసాగుతోంది. అలాగే సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను సైతం ఆ అధికారి ఇబ్బంది పెట్టినట్లు సెక్టోరియల్ అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఉన్నతాధికారి ఇచ్చే నివేదిక మేరకు లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారికి వేటు తప్పదని అంతా మాట్లాడుకుంటున్నారు.
సమగ్రశిక్షలో లైంగిక వేధింపులు
Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM
● కన్నీరు పెట్టుకున్న ఓ మహిళా ఉద్యోగి
● అధికారి ఇంటి వద్దకు వెళ్లి..హెచ్చరికలు
● అయినా అధికారి తీరులో మార్పు లేకపోవడంతో..ఫిర్యాదు
● అధికారి తీరుపై మరో ఉన్నతాధికారి విచారణ
Advertisement
Advertisement


