ఈఓ వివరణ
సంతృప్తికరంగా లేదు
అన్ని పార్టీలను కలుస్తా
సమావేశాలు నిర్వహిస్తా.. కరపత్రం ముద్రిస్తా
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పకు కొండ పైనే తొలి అభిషేకం నిర్వహించాలన్న డిమాండ్ మరోసారి ముందుకు వచ్చింది. వాయులింగేశ్వరుని ఆలయంలో కన్నప్ప విగ్రహం ఉందని, అక్కడ పూజలు చేసిన తర్వాత స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈఓ ఇచ్చిన వివరణను కాకినాడ స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శనివారం తీవ్రంగా ఖండించారు. శ్రీకాళహస్తి కై లాసగిరిపై ఉన్న కన్నప్ప స్వామికి మొదట అభిషేకం చేసి, అనంతరం గర్భాలయంలో వాయులింగేశ్వరునికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆచారాలను విస్మరించి, కన్నప్పను ఉప ఆలయంగా మార్చి గర్భాలయంలోనే తంతు నిర్వహించడం అపచారం అని విమర్శించారు. కొండపై నిత్యపూజలు, ఆలయ నిర్వహణ, యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఆలయ సిబ్బంది ప్రవర్తనపై కూడా చర్యలు తీసుకోవాలని, నాలుగు వైపులా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి ,ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని రమణరాజు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ప్రాచీన వైభవ పునరుద్ధరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, కరపత్రిక ముద్రించి ప్రచారం చేస్తానని తెలిపారు.


