ప్రైవేట్‌ ప్రలాభాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ప్రలాభాలు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

● అకడమిక్‌ పూర్తికాక ముందే అర్బాటాలు ● ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్‌

మా పాఠశాలలో అన్ని సౌకర్యాలుంటాయి.. మెరుగైన విద్యనందిస్తాం.. ఫీజుల్లో రాయితీ ఇస్తాం.. మంచి భవిష్యత్తు ఉంటుంది.. మా పాఠశాలలో చేరండి..ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రతినిధి విద్యార్థితోపాటు అతడి తల్లిదండ్రులకు చెప్పిన మాటలివి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాసంవత్సరం ముగియకముందే వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి టార్గెట్లు విధించడంతో ఉద్యోగ పరిరక్షణకు వారు ఎనలేని పాట్లు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. ఇలా ప్రైవేటు విద్యాసంస్థలు చిన్నారుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

తిరుపతి అర్బన్‌: ప్రైవేటు పాఠశాలలకు చెందిన టీచర్లు విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇంటింటా గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగుస్తుంది. అయితే ముందే అడ్మిషన్ల కోసం ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు టార్గెట్‌ ఇవ్వడంతో విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించడానికి నానా తిప్పలు తప్పడం లేదు. అడ్మిషన్‌ ఫీజు అంటూ రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వసూలు చేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, పట్టణాలు, నగరాల్లో పోటీ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. ఒంటిపూట బడులు మార్చి 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రైవేటు స్కూళ్లు మాత్రమే అడ్మిషన్ల కోసం సాయంత్రం వరకు పాఠశాలలు కొనసాగిస్తునే ఉన్నాయి. తిరుపతిలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించక ముందే అడ్మిషన్ల కోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. పాఠశాలకు గుర్తింపు పొందకముందే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబాలు నివాసానికి చెందిన భవనాలను అద్దెకు తీసుకుని..అందులోనే పాఠశాలలు నిర్వహంచడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటస్థలం, ఖాళీ స్థలం, విశాలమైన గదులు తదితర రూల్స్‌తో పనిలేకుండా పాఠశాల ఏర్పాటుకు జోరుగా కసరత్తు చేస్తున్నారు. అధికారపార్టీకి చెందిన నేతల అండదండలు ఉంటే రూల్స్‌తో పనిలేదంటూ దీమాగా లాగిచేస్తున్నారు. మమ్మల్ని అడ్డుకునేవారు ఎవరంటూ పాఠశాలల ఏర్పాటుకు సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖాధికారులు సైతం చూసీచూడనట్లు ఉండిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ఇంటింటా వెళ్లి అడ్మిషన్లు చేర్పించాలని ఆలోచనతో ఉన్నప్పటికీ ఓ వైపు పదో తరగతి మూల్యాంకనం, మరోవైపు 1 నుంచి 8వ తరగతి వరకు వార్షిక పరీక్షలు, 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌ బోధన బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నెల 23 అకడమిక్‌ గడువు ముగిసిన తర్వాత అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 20 రోజులుగా ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ముందంజలో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిపోతారనే ప్రచారం సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement