● వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు ఆగ్రహం
తిరుపతి రూరల్: ‘నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల్లో అరాచకం, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఫీజులు సకాలంలో కట్టలేదని విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.’ అని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల అరాచకం అరికట్టడంపై భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు. అనంతరం వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం ముల్లంగుంట వద్ద ఉన్న ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న జస్వంత్ రెడ్డి కాలేజీ గోడ దూకి పరారై 30 రోజులు గడుస్తున్నప్పటికీ అతని ఆచూకీ కనిపెట్టలేదన్నారు. అలాగే మరో నర్సింగ్ కాలేజీలో ఫీజు చెల్లించని ఓ విద్యార్థితో మరుగుదొడ్లు కడిగించడం వంటి వికృత చేష్టలను చూస్తుంటే విద్యార్థుల భద్రత, భవిష్యత్తును గాలికి వదిలేసిట్టు అర్థమవుతోందన్నారు. యువకుని అదృశ్యానికి కారణమైన ఆ కాలేజీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ కాలేజీ యజమాని టీడీపీకి మద్దతుదారు కావడమేనా..? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్లపల్లి వద్దనున్న నర్సింగ్ కాలేజీ యజమాని ఒక విద్యార్థిని ఫీజు కట్టనందుకు మరుగుదొడ్లు కడిగించడం, తరగతి గదులు ఊడ్చడం, ప్లేట్లు కడిగించడం వంటి దుశ్చర్యలతో ఆమెకు నరకం చూపారన్నారు. కొన్ని రోజులుగా ఆ నర్సింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి అకతవకలపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాలకు డబ్బులు ఎర
కాలేజీల్లో జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై నిలదీసేందుకు వెళ్లే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులకు యాజమాన్యాలు డబ్బును ఎరగా చూపించి తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. అలాంటి కాలేజీల యాజమాన్యంతోపాటు డబ్బు లు వసూళ్లకు పాల్పడే విద్యార్థి సంఘాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సా ర్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి నరేష్ కుమార్, చంద్రగిరి మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు గూడూరు రఫీ, రామచంద్రపురం మండల అధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, చిన్నగొట్టిగల్లు అధ్యక్షుడు నక్క హరిబాబు, ఎర్రవారిపాళెం విద్యార్థి విభాగం నేత శేషారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


