తిరుపతి అన్నమయ్యసర్కిల్: వేతనాలు సక్రమంగా చెల్లించని కారణంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల డ్రైవర్లు గురువారం మెరుపు సమ్మెకు దిగారు. వేకువజామున అలిపిరి డిపో నుంచి ఎలక్ట్రికల్ బస్సుల వెలుపలికి తీసుకురాకుండా మెరుపు సమ్మెకు దిగారు. దీంతో విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద శ్రీవారి భక్తులు ఎలక్ట్రికల్ బస్సుల కోసం గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నిరీక్షణ భరించలేని మరి కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తిరుమలకు తరలివెళ్లారు. ఎంత సేపటికి బస్సులు రాకపోవడంతో విష్ణునివాసం ముందుభాగంలోని రహదారి పూర్తిగా శ్రీవారి భక్తులతో రద్దీగా మారింది.
డ్రైవర్లూ రండయ్యా..
అలిపిరి డిపోకే పరిమితమైన ఎలక్ట్రికల్ బస్సుల విషయం తెలుసుకున్న సంబంధిత ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ డ్రైవర్లను రండయ్యా విధులకు అంటూ పిలిచినా తమ జీతాల చెల్లింపు సంగతి తేల్చాలని పట్టుపట్టారు. ఈ రోజు తప్పక జీతాలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో తిరుమలకు ఉదయం 10 గంటల తరువాత ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను నడిపినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఆర్టీసీ అధికార యంత్రాంగం కార్మికుల సమస్యల పరిష్కారంలో తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలే ప్రయాణీకుల పాలిట శాపాలుగా మారుతున్నాయని పలువురు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.


