పాపం.. ఉచ్చూరు | - | Sakshi
Sakshi News home page

పాపం.. ఉచ్చూరు

Mar 14 2026 7:21 AM | Updated on Mar 14 2026 7:21 AM

● జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు ● 30కి చేరిన కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ● వారం రోజులుగా వైద్య శిబిరాల నిర్వహణ

ఉచ్చూరు..దొరవారిసత్రం మండలం మూరుమూల గ్రామం.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ గ్రామానికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఏటా సీజనల్‌ వ్యాధులతో సతమతమయ్యే గ్రామస్తులకు ఇప్పుడు మూత్ర పిండాల వ్యాధి మహమ్మారిలా పడగ విప్పి గ్రామస్తులను మృత్యు అంచునకు తీసుకెళుతోంది. ఊహించని ఉప్పెనలా ఉచ్చూరు వాసులను కబళిస్తున్న ఈ వ్యాధి నుంచి ఎలా బయట పడాలో తెలియక వ్యాధిగ్రస్తులు కుంగిపోతున్నారు.

దొరవారిసత్రం : పంచాయతీ కేంద్రమైన ఉచ్చూరులో 540 కుటుంబాలకుగాను 1,450 మంది జనాభా నివాసం ఉంటున్నారు. రెండేళ్ల నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 30కి చేరింది. వీరిలో ఆరుగురు డయాలసిస్‌ చేసుకుంటూ అగచాట్లు పడుతున్న విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఏమి జరుగుతుందనే విషయం తెలియకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురై, పది రోజుల కిందట గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన డీఎంహెచ్‌ఓకు సమాచారం ఇచ్చారు. దొరవారిసత్రం పీహెచ్‌సీ వైద్యాధికారి చైతన్య, వైద్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి 410 మంది రక్త నమూనాలు సేకరించడమే కాకుండా కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై ఆరా తీశారు. వారం రోజులుగా గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సైతం గ్రామంలోని మంచి నీటి పథకాలు, చేతి బోర్లులోని నీళ్లను పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. రెండు రోజుల కిందట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులరెడ్డి, పలువురు వైద్యులు గ్రామంలో పర్యటించి ప్రజలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు పూర్తిస్థాయి అధికారులు నేటి వరకు తెలుసుకోలేకపోవడం గమనార్హం.

ప్రాథమిక విచారణలో..

ఉచ్చూరులో వైద్యుల ప్రాథమిక విచారణలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల రిపోర్ట్‌ల ఆధారంగా వైద్యులు సలహాలు లేకుండా ఇష్టానుసారంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడడంతోపాటు మద్యం సేవించడంతో కిడ్నీలు ఫెయిల్‌ అయి కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటివరకు కిడ్నీ వ్యాధి వచ్చిన వారందరూ 50 ఏళ్లు పైబడిన వారే. మరో వైపు తాగునీటిలో ఖనిజాలు అధికంగా ఉన్నా కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఉచ్చూరులోని అన్ని నీటి పథకాలు, చేతి బోర్లతోపాటు ప్రైవేటు ఆర్వో ప్లాంట్‌లోని నీటి సైతం పరీక్షలు చేసి, ఖనిజాలను గుర్తించేందుకు తిరుపతిలోని ఐఐటీ ల్యాబ్‌కు శ్యాంపిళ్లను పంపారు.

పెయిన్‌ కిల్లర్స్‌, మద్యం కారణం కావచ్చు

ఉచ్చూరులో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారంటే అధికంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడడంతోపాటు మద్యం సేవిచండం కారణం కావచ్చు. అంతేకాకుండా తాగునీటిలో ఖనిజాలు అధిక మొతాదులో ఉన్నా.. కిడ్నీ ఫెయిలై డయాలసిస్‌ బారిన పడవచ్చు. తాగునీటిలో ఖనిజాల శాతం తెలుసుకునేందుకే తాగునీటి శ్యాంపిళ్లను తిరుపతి ల్యాబ్‌కు పంపాం. ఎప్పటికప్పుడు గ్రామంలో తమ వైద్య సిబ్బంది పర్యటిస్తూ వైద్య సేవలందిస్తున్నారు.

– చైతన్య, వైద్యాధికారి, డీవీ సత్రం పీహెచ్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement