సూళ్లూరుపేట: తడమండలం అక్కంపేట సమీపంలోని పొలాల్లో లైసెన్స్ లేకుండా నడుపుతున్న బాణసంచా కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాణసంచా కేంద్రం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. బాణసంచా ముడిసరకులు, టపాసులు స్వాధీనం చేసుకున్నామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని అరెస్టు చూపి, వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం.. తడమండలం అక్కంపేట వద్ద పొలాల్లో మూడు షెడ్లు నిర్మించి అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు తడ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, తడ ఎస్‌ఐ కొండపనాయుడు గురువారం బాణసంచా కేంద్రంపై దాడులు చేశారు. ఈ సందర్భంగా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన రాచగొల్ల హేమంత్‌సాయి (28)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాణాసంచా కేంద్రం నిర్వహించేందుకు లైసెన్స్ ఉందా? అని యజమానిని అడగ్గా తెల్లమొఖం వేయడంతో ఎలాంటి అనుముతులు, లైసెన్స్ తీసుకోకుండా బాణాసంచా తయారు చేయడం చట్ట విరుద్ధమని, బాణసంచా తయారీకి అవసరమైన ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అతన్ని అరెస్ట్ చూపించి సూళ్లూరుపేట కోర్డులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు.


