తిరుపతి అన్నమయ్యసర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షల సమయంలో విద్యార్థులు తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి కల్పించారు. పరీక్షల తేదీల్లో సెలవు దినాలు ఉన్నప్పటికీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. విద్యార్థులు బస్సులో ప్రయాణించే సమయంలో హాల్ టికెట్ చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే పరీక్షల రోజుల్లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా తగినన్ని ట్రిప్పులు తిప్పాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. జగదీష్ అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కోడింగ్ సిస్టమ్ కీలకం
తిరుపతి అర్బన్: పది పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా చేపట్టడానికి కోటింగ్ సిస్టమ్ కీలకమని కడప రీజినల్(జోన్–4) జాయింట్ డైరెక్టర్ శ్యామూల్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా డీఈఓ కేవీఎన్ కుమార్ నేతృత్వంలో ఎనిమిది జిల్లాలకు చెందిన సీసీఓలు, ఏసీజీఈకి ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టారు. సత్యసాయి జిల్లా డీఈఓ కృష్ణప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోడింగ్ సిస్టమ్‌పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ మాత్రం చిన్నపాటి పొరబాట్లు చోటుచేసుకున్న పెద్ద తప్పిదంగా మారుతుందని హెచ్చరించారు డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ కోడింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, నిర్దేశిత విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. తిరుపతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (పబ్లిక్ ఎగ్జామ్స్) సుధ, డీవైఈఓలు, సమగ్ర శిక్ష సీఎంఓ సురేష్, వేణుగోపాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి పలు అంశాలను సూచించారు.
ముగిసిన శిక్షణ
తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్, జర్నలిజం విభాగం విద్యార్థినుల కోసం ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు డిజిటల్ మార్కెటింగ్‌పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి చైన్నెకి చెందిన ఈజ్ నార్ స్టూడియోస్ నిపుణులు రంజిత్ భువనేశ్వరన్, మాధ్యురాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యం, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆన్‌లైన్ బ్రాండింగ్, డిజిటల్ కాంపెయిన్‌ల రూపకల్పన వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆధునిక డిజిటల్ మీడియా రంగంలో ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించేందుకు ఐదు రోజుల శిక్షణ ఉపయోగపడిందని సోషల్‌సైన్సెస్ డీన్ ఆచార్య సి.వాణి తెలిపారు. అనంతరం విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. సోషల్‌సైన్సెస్ విభాగపు అధిపతి టి. త్రిపుర సుందరి పాల్గొన్నారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన రాధిక రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.
క్యూలో నినాదాలు చేయడం తప్పే
తిరుమల: శ్రీవారి దర్శన క్యూలైన్లో నినాదాలు చేయడం తప్పేనని ఓ భక్తుడు ఒప్పుకున్నట్టు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు టీటీడీ పీఆర్‌ఓ విభాగం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్‌లో గురువారం రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీరనవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో నినాదాలు చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడింది. దర్శన క్యూలైన్లో నినాదాలు చేయడం తప్పేనని ఒప్పుకున్నట్టు టీటీడీ పేర్కొంది.


