పవిత్ర భగవద్గీతపై దిక్కుమాలిన ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

పవిత్ర భగవద్గీతపై దిక్కుమాలిన ఆరోపణలు

Mar 7 2026 7:17 AM | Updated on Mar 7 2026 7:17 AM

● భగవద్గీత ముద్రణ స్కాం ఆధారాలు బయటపెట్టాలి ● వైఎస్సార్‌ సీపీ నేతల డిమాండ్‌

తిరుపతి కల్చరల్‌: ఆధ్యాత్మిక చింతనలేక, అవగాహన లేమితో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌.నాయుడు పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై దిక్కుమాలిన ఆరోపణలు చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్‌, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ పసుపులేటి సురేష్‌, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంస్కృతంలో ఉన్న భగవద్గీతను సరళబద్ధంగా అందరికీ అర్థమయ్యేలా టీటీడీ హిందూ ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి భగవద్గీత పుస్తకాలను ముద్రించి, తద్వారా భక్తి విశ్వాసాలను పెంపొందించే దిశగా కృషి చేశారన్నారు. దీనిని కూడా కూటమి నేతలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ భగవద్గీత పుస్తకానికి ముందు మాట అందించిన భూమన కరుణాకరరెడ్డిని సైతం తప్పు పడుతూ అసత్య ఆరోపణలకు దిగడం దిక్కుమాలిన చర్య అన్నారు. అంతేకాక భగవద్గీతను హేళన చేస్తూ ఈ పుస్తకాన్ని చూస్తే ఉమ్మేస్తారని విమర్శించడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? అని ప్రశ్నించారు. దీనికి తోడు ఈ పుస్తకాల ముద్రణలో రూ.50 కోట్లు స్కాం జరిగిందని నిసిగ్గుగా నిందారోపణలు చేయడం దుర్మార్గమన్నారు. టీటీడీ పాలక మండలి ఆమోదంతో టీటీడీ ముద్రణశాలలో ఈ పుస్తకాలు ముద్రిస్తే అక్కడ రూ.కోట్లు స్కాం జరిగిందని పచ్చి అబద్ధాలకు పాల్పడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ముద్రించిన భగవద్గీత ప్రచురణలను గోడౌన్లలో ఎందుకు ఉంచారని టీటీడీ చైర్మన్‌ అనడం శోచనీయమన్నారు. భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు అయిందని, జనసేన నేత కిరణ్‌ రాయల్‌ పసలేని విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజాసమస్యల గురించి ప్రస్తావించడం తెలియక ఆరోపణలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. భగవద్గీత పుస్తకాల ముద్రణలో రూ.50 కోట్లు స్కాం జరిగిందని చెబుతున్న మీరు ఆ స్కాం ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 1990లో టీటీడీ రూల్‌ బుక్‌, ఏపీ గెజిట్‌ నోట్‌లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా భగవద్గీత అందించాలనే నిర్ణయంతో భగవద్గీత పుస్తకాల ముద్రించినట్లు చెప్పారు. హిందూ ధర్మంపై విశ్వాసాన్ని పెంచడం కోసం భగవద్గీతను ముద్రిస్తే, దాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అన్నారు. టీటీడీకి తాను కాపలా కుక్కనని చెప్పుకునే భానుప్రకాష్‌రెడ్డి దీనిపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. హిందువుల ముసుగులో తుమ్మా ఓంకార్‌, కిరణ్‌ రాయల్‌ తమ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేతలు దినేష్‌ రాయల్‌, మహేష్‌, ప్రేమ్‌, స్వరూప్‌, శివ, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement